AP Politics: సీఎం జగన్ స్టిక్కర్ల ప్రభుత్వాన్ని స్టిక్కులతో కొట్టే సమయం వచ్చింది: తులసిరెడ్డి
'మా నమ్మకం నువ్వే జగన్' అనే స్టిక్కర్లను రాష్ట్రంలో ప్రతి ఇంటికీ అతికించాలని జగన్ నిర్ణయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి.
Maa Nammakam Nuvve Jagan sticker decision: వై నాట్ 175 సీట్స్ అనే కామెంట్లు చేస్తున్నా.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి అన్నారు. 'మా నమ్మకం నువ్వే జగన్' అనే స్టిక్కర్లను రాష్ట్రంలో ప్రతి ఇంటికీ అతికించాలని జగన్ నిర్ణయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ స్టిక్కర్ల పార్టీని రాష్ట్ర ప్రజలు స్టిక్కుతో కొట్టే సమయం వస్తుందన్నారు. సీఎం జగన్ ను కుటుంబసభ్యులే నమ్మే పరిస్థితి లేదని, ప్రజలు ఎలా నమ్ముతారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
మా నమ్మకం నువ్వే జగన్ అంట.. ఎందుకు నమ్మాలి జగన్ నిన్ను అని తులసిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల ఏపీగా చేసినందుకా, అరాచక ఆంధ్రప్రదేశ్ చేసినందుకా, జూదాంధ్రప్రదేశ్, ఇసుక మాఫియా, వైన్ మాఫియా, బియ్యం మాఫియా, ఎర్రచందనం రాజ్యం చేసినందుకా, సమాజంలోని అన్ని వర్గాలను మోసం చేసినందుకు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మాలా అని సీఎం జగన్ పై కామెంట్ చేశారు. రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, సర్పంచులను.. ఇలా అన్ని వర్గాలను సీఎం జగన్ మోసం చేశారంటూ మండిపడ్డారు.
కుటుంబసభ్యులే నిన్ను నమ్మరు !
రాష్ట్ర ప్రజలను పక్కనపెడితే కుటుంబసభ్యులు సైతం సీఎం జగన్ ను నమ్మే పరిస్థితి లేదన్నారు తులసిరెడ్డి. సోదరి వైఎస్ షర్మిల, బాబాయి కూతురు డాక్టర్ సునీత సైతం జగన్ ను నమ్మరు అనేది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు పొందేవారి ఇంటికి మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్లను అతికించాలని ఇటీవల నిర్ణయించారు. కుటుంబసభ్యులే నమ్మరు కానీ రాష్ట్ర ప్రజలు ఎందుకు నమ్ముతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గతంలోనూ సీఎం జగన్ పై తులసిరెడ్డి విమర్శలు
2019 ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఉద్యోగులకు సంబంధించి వైఎస్ చేసిన చేసిన ఐదు ప్రధానమైన వాగ్దానాలను తులసిరెడ్డి గుర్తుచేశారు. సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం, సకాలంలో పిఆర్సి అమలు చేయడం, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం కల్పించడం.. లాంటి 5 ముఖ్యమైన వాగ్దానాలను గత ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చాక ఈ హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పుకునే వైఎస్ జగన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక చేసిందేమిటని ప్రశ్నించారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఇతర ఉద్యోగుల తరహాలోనే పనికి సమాన వేతనం కల్పించకపోవడమే కాకుండా ఈ మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో దాదాపు 50వేల మంది కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఉద్యోగాల నుండి తొలగించడం దారుణం అన్నారు. ఇంకా రెండు లక్షల 50వేల మందిని తొలగించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తులసిరెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.