కర్నూలు: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురై మంటల్లో కాలిపోవడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 20 మంది వరకు సజీవ దహనం అయ్యారని సమాచారం. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లాలో ప్రమాదానికి గురైంది. ఉలిందకొండ దగ్గర జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి 20 మంది సజీవ దహన మయ్యారు. 12 మంది ప్రాణాలతో బయటపడ్డారని తెలుస్తోంది.
ప్రమాదానికి కారణమేంటి..
హైదరాబాద్ నుంచి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బెంగళూరుకు బయలుదేరింది. మార్గం మధ్యలో నేషనల్ హైవే 44పై కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలోకి రాగానే బైకును ఢీకొట్టింది. ఆ టూవీలర్ బస్సు కిందికి దూసుకెళ్లి ఫ్యూయల్ ట్యాంకును ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో బస్సు మొత్తం మంటలు వ్యాప్తిచెందాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు అసలేం జరిగిందో తెలుసుకునేలోపే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
కొందరు ప్రయాణికులు లేచి చూస్తుండగానే బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలను ధ్వంసం చేసుకుని కిందకు దూకి స్వల్ప గాయాలతో బటయపడ్డారు. దాదాపు 12 మంది ప్రయాణికులు బస్సు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. స్థానికుల సహాయంలో పోలీసులు, రెస్క్యూ టీమ్ గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అసలే తెల్లవారుజాము కావడంతో ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్నారు. దాంతో అసలేం జరిగిందో వారికి తెలిసే లోపే ప్రాణాలు కోల్పోయారని అధికారులు, రెస్క్యూ టీమ్ తెలిపారు.
డోర్ ఓపెన్ అయ్యే కేబుల్ తెగిపోవడంతో..
కర్నూలు : కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. బైక్ బస్సు కిందకు వెళ్లడంతో.. డోర్ ఓపెన్ అయ్యే కేబుల్ తెగిపోయిందని.. దాంతో ప్రయాణికులు డోర్ తెరవడం సాధ్యం కాలేదని తెలిపారు. ఇప్పటివరకు 11 మృతదేహాలు వెలికితీశామన్నారు. అయితే ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మిస్ అయ్యారు, ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ తప్పించుకున్నాడని తెలిపారు. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారని కలెక్టర్ సిరి వెల్లడించారు.