Just In





Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Pawan Kalyan Latest News:చదువుకున్న రోజుల్లో పవన్ పేరు చెబితేనే తనను ర్యాగింగ్ చేశారని నంద్యాల ఎంపీ గుర్తు చేసుకున్నారు. పవన్ పర్యటన సందర్భంగా ఈ విషయాన్ని చెప్పారు.

Pawan Kalyan Latest News: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో పాల్గొన్న నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక సందర్భంలో పవన్ పేరు చెబితే తనను ర్యాగింగ్ చేశారని దెబ్బకు ఏడాది ఆ పేరు ఎత్తలేదని చెప్పారు.
కర్నూలు జిల్లా పూడిచర్లలో పర్యటించిన పవన్ కల్యాణ్ అక్కడ ఫామ్‌పాండ్స్‌కు భూమి పూజ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1.55 లక్షల ఫామ్‌పాండ్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బైరెడ్డి శబరి గతంలో తనకు ఎదురైన అనుభవాలు గురించి చెప్పారు. ఆమె మాట్లాడేందుకు వచ్చినప్పుడు పవన్ అభిమానులు గోల గోల చేశారు. వారిని కంట్రోల్ చేయడానికి తను కూడా పవన్ ఫ్యాన్ అని చెప్పుకున్నారు. తాను ఎంబీబీఎస్ చదువుతున్న టైంలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకున్నారు.
ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో తాను కాలేజీ వెళ్లినప్పుడు సీనియర్స్ ర్యాగింగ్ చేశారని శబరి తెలిపారు. కొందరు సీనియర్స్ వచ్చి మీ ఫేవరెట్ హీరో ఎవరని అడిగారన్నారు. తాను తడుముకోకుండా పవన్ కల్యాణ్ అని చెప్పినట్టు వెల్లడించారు. మరికొందరు వచ్చి నీవు ఎలా ఫ్యాన్ అవుతావని తామే నిజమైన ఫ్యాన్స్ అని గొడవ పెట్టుకున్నట్టు గుర్తు చేసుకున్నారు. ఆ రోజు జరిగిన గొడవతో తాను ఏడాది పాటు పవన్ పేరు ఎత్తలేదని అన్నారు. అంతలా తనను భయపెట్టారని గుర్తు చేసుకున్నారు శబరి. దీంతో అక్కడి వారంతా నవ్వుకున్నారు.
ఈ కార్యక్రమంలోనే పవన్ వేదికపై చేరుకునే సరికి ఓ పిల్లాడు రెడ్ టవల్‌తో కనిపించాడు. ముద్దుగా ఉన్న ఆ పిల్లాడని పైకి పిలిచి ఎత్తుకున్నారు. ఆ బాలుడిని భుజంపై కూర్చోపెట్టుకొని దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫామ్ పాండ్స్ భూమి పూజ కార్యక్రమంలో మాట్లాడిన పవన్ కల్యాణ్... విజయంలోనే మనుషులను లెక్కించడం సరికాదన్నారు కష్టంలో ఉన్నప్పుడు కూడా ఎలా ఉన్నరేది పోల్చుకుంటామన్నారు. అలా కష్టాల్లో నిలబడినందుకే ప్రజలు కూటమి పార్టీలను గెలిపించారన్నారు. ఈ విజయం యువకులకు, మహిళలకు దక్కుతుందన్నారు. గెలిచిన ఈ కొద్ది నెలల్లోనే కర్నూలు జిల్లాలో రూ.75 కోట్లతో 117 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశారమని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద 98 శాతం రోడ్ల నిర్మాణం పూర్తైనట్టు పేర్కొన్నారు.
వచ్చే వర్షాకాలం నాటికి ఫామ్ పాండ్స్ పూర్తి అయితే నీరు నిల్వ అవుతుందన్నారు పవన్. ఇలా ఎక్కడికక్కడ నీరు నిల్వ చేసుకుంటే నీటి కొరతే లేకుండా చేయవచ్చని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయితీ సహా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. వాటిని సరి చేస్తూనే ప్రజలకు ఉపాధి, ఆర్థిక స్థిరత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు వివరించారు. మౌలిక వసతులు కల్పించి వారి సమస్యలు దూరం చేసే ప్రయత్నాల్లో ఉన్నామని వివరించారు.
క్లిష్టపరిస్థితిల్లో ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం ఎంతగానో తోడ్పాటు అందిస్తోందన్నారు పవన్ కల్యాణ్. ఓ వైపు రాష్ట్రంలో పాలన గాడిలో పెడుతూనే పెట్టుబడు ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించారు. అదే టైంలో ప్రజలకు చేరాల్సిన పథకాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు.