Srisailam Lathi charge:ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల పుణ్యక్షేత్రంలో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరమశివుని దర్శనం కోసం ఎంతో నిష్ఠతో వచ్చే భక్తులు, శివ స్వాములకు చుక్కెదురైంది. కనీస సౌకర్యాలు లేక గంటల తరబడి క్యూలైన్‌లలో వేచి ఉండలేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పెట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు శ్రీశైలంలో ఏం జరుగుతోంది? భక్తులు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? ఈ ఉద్రిక్తతకు కారణాలేంటి?
దర్శనం లేదు... దాహం తీర్చే దిక్కు లేదు!
శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం సోమవారం తెల్లవారు జాము నుంచే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఉదయం ఐదు గంటల నుంచే భక్తులు, శివ స్వాములు క్యూలైనలలో వేచి ఉన్నారు. అయితే గంటలు గడుస్తున్నా క్యూ లైన్‌లు ముందుకు కదలక పోవడంతో భక్తుల్లో అసహనం మొదలైంది. కనీసం తాగడానికి నీరు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం శ్వాస తీసుకోవడానికి కూడా తగినంత గాలి లేదు, ఇరుకైన కంపార్టమెంట్‌లలో భక్తులు నరక యాతన అనుభవించారు. ఈ క్రమంలోనే దర్శనం కోసం ఎదురు చూసే కొందరు భక్తులు ఉక్కపోతకు, నీరసంతో కళ్లు తిరిగి పడిపోవడం జరిగింది.
భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం అధికారులు పూర్తిగా విఫలమయ్యారని శివస్వాములు మండిపడుతున్నారు. ఆలయ ఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి చేయి దాటి పోతుండటంతో ఆగ్రహించిన శివ స్వాములు క్యూలైన్ గేట్లు ఎక్కి బయటకు వచ్చి తమ నిరసన తెలియజేశారు.
పోలీసుల లాఠీ ఛార్జ్
రద్దీని నియంత్రించడానికి జిల్లా ఎస్పీ సునీల్, ఏఏస్పీ యుగంధర్ బాబు రంగంలోకి దిగారు. అయితే భక్తుల ఆవేశాన్ని అదుపు చేయడం పోలీసులకు సాధ్యం కాలేదు. ఈ క్రమంలోనే ఏఎస్పీ యుగంధర్ బాబు లాఠీతో భక్తులను బెదిరిస్తూ, వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. మాల వేసుకున్న శివ స్వాములపై పోలీసులు లాఠీలు జులిపించడంపై భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుతో విసిగిపోయిన చాలా మంది శివ దీక్ష స్వాములు , రాజగోపురం నుంచే స్వామి వారిని దర్శించుకోకుండానే వెనుదిరిగారు. శ్రీశైలం ఆలయ చరిత్రలోనే ఇలాంటిది గతంలో ఎప్పుడూ జరగలేదని భక్తులు ఆవేదనతో చెబుతున్నారు.
మాజీ మంత్రి రోజా తీవ్ర ఆగ్రహం
శ్రీశైలంలో భక్తులపై జరిగిన లాఠీచార్జ్ ఘటనపై వైఎస్‌ఆర్ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా తీవ్రంగా స్పందించారు. ఆమె ెక్స్ వేదికగా ప్రభుత్వ తీరును ఎండగట్టారు. "దేవుడంటే భయం లేదు, భక్తులంటే గౌరవం లేదు. ఈ రాక్షస పాలనలో ఆలయాలకు రక్షణే లేదు" అని ఆమె మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతల ఇళ్లపై దాడులు చేసినప్పుడు చేతులు ముడుచుకొని కూర్చొన్న పోలీసులు, ఇప్పుడు సామాన్య భక్తులపై ప్రతాపం చూపడం సిగ్గు చేటు అని విమర్శించారు. ప్రభుత్వ సనాతన ధర్మం పేరుతో నాటకాలు ఆడుతోందని నిజమైన భక్తులను గౌరవించం నేర్చుకోవాలని హితవు పలికారు. పాలకులకు ఊడిగడం చేయడం మానేసి ప్రజల కోసం పోలీసులు పని చేయాలని కోరారు.
రద్దీ పెరుగుతున్నప్పుడు అధికారులు ఎందుకు అప్రమత్తం కాలేదన్నది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రధానమని భక్తులు కోరుతున్నారు. శివరాత్రి రోజు వరకు రద్దీ ఉంటుందని అందుకే సౌకర్యాలు మరింతగా పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.