Kurnool News: కర్నూలు (Kurnool)జిల్లాలో బస్సు యాత్ర సందర్భంగా సీఎం జగన్(Jagan) వైసీపీ(YCP) అభ్యర్థుల పరిచయ కార్యక్రమం చాలా హాట్‌టాపిగ్‌గా మారింది. వైసీపీ నుంచి పోటీపడుతున్న వారంతాపేదవాళ్లని, వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని చెప్పారు. దీంతో వారి ఆస్తులపై అందరి దృష్టి మళ్లింది. జగన్ చెప్పినట్టు నిజంగా వాళ్లు అంతే పేదవాళ్ల. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమా అంటూ సెర్చ్ చేస్తున్నారు. 2014, 2019 వారు పోటీ చేసినప్పుడు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్స్ చూస్తే వారి ఆర్థికి స్థితి ఏంటో అర్థమవుతుంది. 


బుట్టమ్మ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే
ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక(Butta Renuka)ను పరిచయం చేస్తూ సీఎం జగన్.. నా చెల్లెమ్మ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని చెప్పారు. 2019లో పోటీ చేయని బుట్ట రేణుక...  2014 కర్నూలు నుంచి వైసీపీ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆమె ఆస్తులు అక్షరాల...242.60 కోట్లు. ఈ పదేళ్లలో  నాటి ఆస్తులు అన్నీ ఏమయ్యాాయనే ప్రశ్న వినిపిస్తుంది.


వ్యాపార కుటుంబ నుంచి వచ్చిన  బుట్టా రేణుకకు ఆటోమొబైల్స్‌, ఆతిథ్యరంగంలో వ్యాపారాలు ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న విధంగా ఆమె వద్ద విలువైన రత్నాలు పొదిగిన రెండున్నర కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల వద్ద మరో కిలో బంగారం ఉంది. వీటివిలువే 2 కోట్లు ఉంటుంది. రేణుక కుటుంబానికి ఉన్న వ్యాపారం సంస్థలు 


1. బుట్టా ఎంటర్‌ప్రైజస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌


2. బుట్టా ఆటోమేటివ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌


3. బుట్టా చిట్‌ ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌


4. బుట్టా కన్వెన్షన్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌


5. బుట్టా ఫెసిలిటీ అండ్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌


6. బుట్టా హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌


7. బుట్టా హాస్పిటాలిటీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌


8. బుట్టా ఇంపెక్స్‌ అండ్‌ ట్రేసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌


9. బుట్టా ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌


10. తేజస్వీ మోటార్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌


ఇలా చాలా కంపెనీలున్నాయి. వీరికి హైదరాబాద్‌(Hyderabad)లోని బంజారాహిల్స్‌, మాదాపూర్‌లో మెరిడియన్ స్కూళ్లు ఉన్నాయి. దీనిలో ఆమె షేర్‌ విలువ 25 కోట్లు వరకు ఉంది. ఆమె కుటుంబ సభ్యుల పేరిట హైదరాబాద్‌లో కోట్ల రూపాయల విలువైన ఇళ్లు, ఇళ్లస్థలాలు ఉన్నాయి.  పంజాగుట్టలో ఓ హోటల్ ఉన్నట్లు స్వయంగా ఆమె అఫిడవిట్‌లో పేర్కొంది.  


ఆదోని సాయన్న ఆస్తులు అంతంతమాత్రమేనట..?
ఆదోని(Adhoni) నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సాయిప్రసాద్‌రెడ్డి(Sai Prasad Reddy) సైతం డబ్బులు లేనివాడేనని జగన్ చెప్పారు. 2019 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారమే ఆదోని ఎమ్మెలే సాయిప్రసాద్‌రెడ్డి ఆస్తుల విలువ 5.17 కోట్లు. తమది సంపన్న కుటుంబమని ఆయనే పలు సందర్భాల్లో చెప్పారు. ప్రియదర్శిని అర్బన్‌ కోఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంక్‌లో వాటాలు, షిర్డీసాయి కార్పొరేషన్‌లో ఆయన భార్యకు పెట్టుబడులున్నాయి. 50 ఎకరాల వరకు వ్యవసాయ భూములు, కర్నూలు జిల్లా వ్యాప్తంగా భూములు, ప్లాట్లు, ఇళ్లస్థలాలు ఉన్నాయి. అలాగే 35 లక్షల విలువైన కారు ఉంది. ఇక భూకబ్జాలు, బెట్టింగ్‌లు, మట్కా వంటి వాటిల్లో సాయన్నది బాగా చేయి తిరిగిన వ్యవహారమేనని కర్నూలు జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారు. అలాంటి సాయిప్రసాద్‌రెడ్డి సౌమ్యుడంటూ జగన్ కితాబివ్వడం విశేషం. ఆయన ఆదేశాలతోనే ఓ ఆటోడ్రైవర్‌ను, జనసేన కార్యకర్తను సాయిప్రసాద్‌రెడ్డి అనుచరులు చావబాదారు.


బాలనాగిరెడ్డీ బీదవాడేనా..?
మంత్రాలయం(Manthralayam) అభ్యర్థి బాలనాగిరెడ్డి(Balanagiredy) సైతం బీదవాడేనని జగన్(Jagan) చెప్పారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తులు 2.29 కోట్లు. 44 ఎకారాల వ్యవసాయ భూములు, ఆదోని, గుంతకల్లు, ఎమ్మిగనూరుల్లో విశాలమైన భవనాలు, కర్నూలులో సొంతిల్లు ఉన్నాయి. బీమా ఎడ్యుకేషన్‌ సొసైటీలో వాటాలున్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిపై కాల్పుల ఘటనలో ఈయన అనుచరలే ప్రధాన నిందితులని టీడీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వ భూములు కబ్జా, తుంగభద్ర నుంచి అక్రమ ఇసుక రవాణాలో బాలనాగిరెడ్డిదేనంటూ ఆరోపణలు ఉన్నాయి. 


శ్రీదేవి అక్కను ఆశీర్వదించండి
పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి(Sridevi) ఆస్తులు సైతం తక్కువేమీ కాదు ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆమె ఆస్తులు 3.19 కోట్లు. కర్నూలు జిల్లాలో 42 ఎకరాల వ్యవసాయ భూములు, తెలంగాణ(Telangana)లో విలువైన స్థలాలు, ఇల్లు ఉన్నాయి.  


కోడుమూరు అభ్యర్థి సతీష్‌
కోడూమూరు(Kodumuru) అభ్యర్థి సౌమ్యుడు, పేదవాడంటూ జగన్ చెప్పారు. మంత్రి ఆదిమూలపు సురేశ్‌(Adhimulapu Suresh)కు స్వయంగా తమ్ముడైన సతీశ్‌(Sathish)కు కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయని చెబుతున్నారు. కర్నూలుతోపాటు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, మార్కాపురం పట్టణాల్లో విద్యా సంస్థలతోపాటు విలువైన భూములు, ప్లాట్లు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. కర్నూలులో బీఈడీ, నర్సింగ్‌ కళాశాలలతోపాటు మరో కళాశాల, కర్నూలు జొహరాపురం సమీపంలో కోట్ల విలువైన స్థలాలు,  ఉన్నాయని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. 


విరూపాక్షి ఇంతియాజ్‌కూడా పేదవాళ్లేనా 
ఆలూరు అభ్యర్థి విరూపాక్షి(Virupakshi) రైల్వేలో క్లాస్‌-1 కాంట్రాక్టర్, ఇంతియాజ్‌ మాజీ ఐఏఎస్‌ అధికారి. వివిధ హోదాల్లో పని చేశారు. ఇలాంటి వారందర్నీ పేదవారు అనడంతో ప్రతిపక్షాలతోపాటు సోషల్ మీడియా యాక్టివ్‌ అయ్యాయి. వారి ఆస్తుల వివరాలు తవ్వితీయడం మొదలు పెట్టాయి.