Tungabhadra River  Cattle Death:    ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత పవిత్రమైన, వ్యవసాయ పండుగ రోజైన ఏరువాక పౌర్ణమి నాడే ఒక అన్నదాత కుటుంబంలో తీరని విషాదం నిండింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మంచాల గ్రామానికి చెందిన కురవ సురేష్ అనే నిరుపేద రైతు.. తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే రెండు కాడెద్దులు తుంగభద్ర నదిలో ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయాయి. వ్యవసాయ సీజన్ ప్రారంభమయ్యే రోజే, చేతికొచ్చిన జంట ఎద్దులను కోల్పోవడంతో ఆ రైతు కుటుంబం నది ఒడ్డునే పశువుల మృతదేహాలపై పడి కన్నీరుమున్నీరుగా విలపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి.  నదిలో నీరు తాగించబోయి ప్రమాదం 

Continues below advertisement

 ఏరువాక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని రైతు కురవ సురేష్ తన రెండు ఎద్దులను శుభ్రం చేసి, పూజించడానికి తుంగభద్ర నది తీరానికి తీసుకెళ్లారు. అయితే నదిలో నీరు తాగుతున్న సమయంలో,  బురద గుంతల్లోకి కాలు జారడంతో ఆ రెండు ఎడ్లు నీటిలో మునిగిపోయాయి. వాటిని కాపాడుకునేందుకు సురేష్ ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పశువులను కేవలం జంతువులుగా కాకుండా, తమ సంపదగా, కుటుంబ సభ్యుల్లా భావించే భారతీయ రైతు సంస్కృతికి అద్దం పడుతూ.. ఆ మూగజీవాల మరణాన్ని తట్టుకోలేక ఆ కుటుంబం రోదించిన తీరు ఊరంతటా శోకసంద్రాన్ని నింపింది.  అన్నదాత ఆవేదనకు చలించిన సీఎం చంద్రబాబు 

ఈ హృదయవిదారక ఉదంతం సామాజిక మాధ్యమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  దృష్టికి వెళ్ళింది. రైతు సురేష్ కుటుంబం పడుతున్న ఆవేదనను చూసి ఆయన తీవ్రంగా చలించిపోయారు. ఈ ఘటనపై సీఎం స్పందిస్తూ..  మన సంస్కృతిలో పశువులను సంపదగా భావిస్తాం. రైతన్నకు వెన్నుదన్నుగా ఉండేవి ఆ కాడెద్దులే. అన్నదాతకు పవిత్రమైన రోజైన ఏరువాక పౌర్ణమి నాడు ఇవి మృతి చెందడం, ఆ యజమాని కుటుంబం ఆవేదనతో విలపించడం నన్నెంతో కలచి వేసింది. ఎడ్లు లేని లోటు పూడ్చలేనిదైనప్పటికీ.. ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున తక్షణమే పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించాను  అని ప్రకటించారు.   

Continues below advertisement

   ఆసరాగా నిలిచిన ప్రభుత్వం.. మానవీయతకు అద్దం పట్టిన ఘటన!             

ప్రాణంలా చూసుకునే ఎడ్లను కోల్పోయి, వ్యవసాయం ఎలా చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ నిరుపేద రైతు కుటుంబానికి ప్రభుత్వం తరపున సాయం అందించాలని ముఖ్యమంత్రి సూచించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆర్థిక సహాయం ఎడ్ల ప్రాణాలను తిరిగి తీసుకురాలేకపోయినా.. కొత్త సీజన్‌లో ఆ రైతు మళ్లీ నిలదొక్కుకోవడానికి, మరో కాడిని కొనుగోలు చేయడానికి ఈ ప్రభుత్వ సాయం ఎంతో ఆసరాగా నిలవనుంది. పాలకుల గుండెల్లో సామాన్య రైతుల పట్ల ఉండే మానవీయతకు, తక్షణ స్పందనకు ఈ ఘటన ఒక ప్రతీకగా నిలిచింది.