Rebirth of Punarvika: చిన్నారి పునర్వికకు పునర్జన్మ- రూ.16 కోట్ల ఇంజక్షన్ చికిత్స పూర్తి - లోకేష్ ట్వీట్ వైరల్
Kurnool child Punarvika : చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల అత్యంత ఖరీదైన ఇంజక్షన్ కోర్సు పూర్తయింది. ఈ అంశంపై నారా లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ అయింది.

Nara Lokesh: రాజకీయాల్లో హామీలు ఇవ్వడం, వాటిని నెరవేర్చడం సాధారణమే కావచ్చు. కానీ, ఒక చిన్నారి ప్రాణం నిలపడం కోసం కోట్లాది రూపాయల నిధులను సమకూర్చి, ఆ పాపకు పునర్జన్మ ప్రసాదించడం రాజకీయాలకు అతీతమైన అరుదైన సందర్భం. అసాధ్యమనుకున్న పోరాటాన్ని సుసాధ్యం చేసి, కర్నూలు చిన్నారి పునర్విక జీవితంలో వెలుగులు నింపారు మంత్రి నారా లోకేష్ .
ప్రాణం మీదికి తెచ్చిన అరుదైన వ్యాధి
కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సురేష్ కుమార్, పుష్పావతి దంపతులకు పునర్విక జన్మించినప్పుడు ఆ ఇంట ఆనందాలు వెల్లివిరిశాయి. కానీ, ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. చిన్నారి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ టైప్-1 అనే అత్యంత అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. ఈ వ్యాధి సోకితే పిల్లల కండరాలు క్రమంగా క్షీణించి, కనీసం శ్వాస తీసుకోలేని స్థితికి చేరుకుని ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. దీనికి విరుగుడుగా జోల్గెన్స్మా అనే ఇంజక్షన్ చేయించాలి.ఈ ఇంజెక్షన్ ధర అక్షరాలా రూ. 16 కోట్లు . ఆ సామాన్య కుటుంబానికి ఇది ఎవరెస్ట్ శిఖరమంతభారం.
కదిలిన తెలుగు లోకం.. కలిసిన నిధులు
పునర్విక ప్రాణం కాపాడాలంటూ సోషల్ మీడియా వేదికగా సాగిన పోరాటం ఒక మహా ఉద్యమంగా మారింది. నెటిజన్లు, సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు స్పందించి రూపాయి రూపాయి కలిపి దాదాపు రూ. 10 కోట్ల వరకు సేకరించారు. అయితే, లక్ష్యం చేరుకోవడానికి ఇంకా రూ. 6 కోట్లు తక్కువయ్యాయి. పాప ఆరోగ్యం క్షీణిస్తుండటంతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయంలో, ఈ విషయం నారా లోకేష్ దృష్టికి చేరింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఫిబ్రవరి లో ఆయన ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. మిగిలిన రూ. 6 కోట్ల బాధ్యత నాది.. పునర్వికను కాపాడుకుందాం అంటూ ఇచ్చిన మాటకు ఆయన కట్టుబడ్డారు.
నిధుల సేకరణే కాదు.. అనుమతుల అడ్డంకులు కూడా!
రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ విదేశాల నుండి రావాలంటే భారీగా దిగుమతి సుంకాలు, సాంకేతిక అనుమతులు అవసరం. మంత్రి లోకేష్ కేవలం నిధులను సమకూర్చడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో స్వయంగా మాట్లాడి కస్టమ్స్ క్లియరెన్స్ , ఇతర అనుమతులు వేగంగా వచ్చేలా పర్యవేక్షించారు. ఆ చిన్నారి ప్రాణం కాపాడటం కోసం ఆయన ఒక మంత్రిగా కాకుండా, ఆ ఇంటి సభ్యుడిలా ప్రతి అడుగులోనూ అండగా నిలిచారు. చివరికి, శనివారం నాడు ఆ ఖరీదైన ఇంజెక్షన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది.
Promise Kept.
— Lokesh Nara (@naralokesh) April 18, 2026
Punarvika's injection done today.
Live a 100 years Chitti Talli! pic.twitter.com/UnAxkAfChs
వందేళ్లు వర్ధిల్లు చిట్టితల్లి!
ఇంజెక్షన్ పూర్తయిన వెంటనే లోకేష్ తన సోషల్ మీడియా వేదికగా అత్యంత ఎమోషనల్‌గా స్పందించారు. మాట నిలబెట్టుకున్నాను. పునర్వికకు ఇంజెక్షన్ ప్రక్రియ పూర్తయింది. వందేళ్లు వర్ధిల్లు చిట్టితల్లి అంటూ ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ చిన్నారికి పునర్జన్మ నివ్వడం ద్వారా ఒక కుటుంబం మొత్తం ప్రాణం పోసుకుందని, లోకేష్ చూపిన ఈ మానవత్వం అందరికీ స్ఫూర్తిదాయకమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే అయినా, ఒక నిండు ప్రాణాన్ని కాపాడేందుకు లోకేష్ చూపిన చొరవపై అభినందనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సేవ అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమే కాదు, ప్రజల గుండె చప్పుడు వినడం అని ఆయన నిరూపించారని అభిప్రాయపడుతున్నారు. పునర్విక చిరునవ్వు ఇప్పుడు నారా లోకేష్ సాధించిన అతిపెద్ద విజయం అనుకోవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు




















