సియాటిల్ నగరం 29 మిలియన్ డాలర్లు (సుమారు ₹262 కోట్లు) చెల్లించడానికి అంగీకరించింది. ఈ డబ్బును జాహ్నవి కుటుంబానికి అందజేస్తారు.
Jahnavi Kandula Case: అమెరికా పోలీసుల నిర్లక్ష్యంతో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి భారీ పరిహారం!
Jahnavi Kandula Case: పోలీసుల నిర్లక్ష్యం కారణంగా అమెరికాలో ఒక భారతీయ విద్యార్థిని మరణించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె కుటుంబానికి ₹262 కోట్ల పరిహారం అందనుంది.

Jahnavi Kandula Case: అమెరికాలో 2023లో రోడ్డు దాటుతున్న టైంలో తెలుగు అమ్మాయి జాహ్నవి కందులను పోలీస్ వాహనం ఢీ కొట్టింది. 23 ఏళ్ల అమ్మాయి ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లి ఇలా మృతి చెందడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ కేసులో ఇన్ని రోజుల విచారణ తర్వాత అమెరికాలోని సియాటిల్ సిటీ 29 మిలియన్ డాలర్ల అంటే సుమారు ₹262 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. ఆ డబ్బులను జాహ్నవి ఫ్యామిలీకి అందజేయనున్నారు. దీంతో ఈ కేసు ఇప్పుడు చట్టపరమైన పరిష్కారానికి చేరుకుంది.
"జాహ్నవి కందుల మరణం చాలా విషాదకరం. ఈ ఆర్థిక పరిష్కారం జాహ్నవి కుటుంబానికి కొంత ఓదార్పునిస్తుందని సియాటిల్ సిటీ ఆశిస్తోంది. ఆమె కుటుంబానికి, స్నేహితులకు, సమాజానికి ఆమె చాలా ముఖ్యం" అని సిటీ న్యాయవాది ఎరికా ఎవాన్స్ ఒక ప్రకటనలో తెలిపారు.
పోలీస్ ఆఫీసర్ కెవిన్ డేవ్ వేగంగా వాహనం నడుపడం వల్లే జాహ్నవి ప్రాణాలు కోల్పోయింది. అతను దాదాపు 119 కి.మీ/గం వేగంతో ప్రయాణిస్తున్నాడు. కానీ ఆ ప్రాంతంలో వేగ పరిమితి దాదాపు 40 కి.మీ/గం. ప్రమాదం జరిగిన తర్వాత ఆమె 138 అడుగుల దూరంలో పడి స్పాట్‌లోనే చనిపోయింది. ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు ప్రవర్తించిన తీరుతో ఈ కేసులో సంచలనంగా మారింది. పోలీసు అధికారి బాడీ కెమెరాలో రికార్డు అయిన ఆడియో బయటకు రావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఆ అధికారి నవ్వుతూ జాహ్నవి జీవితం విలువ పరిమితమని వెటకారంగా స్పందించాడు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా అమెరికా పోలీసుల తీరుపై ఆగ్రహం, నిరసనలు చోటు చేసుకున్నాయి. భారత్ కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది
జాహ్నవిని కించపరుస్తూ మాట్లాడిన అధికారి డేనియల్ ఆడెరర్‌ను విధుల నుంచి తప్పించారు. వాహనాన్ని నడుపుతున్న అధికారి కెవిన్ డేవ్‌ను కూడా పోలీసు శాఖ తొలగించింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు దోషిగా తేలడమే కాకుండా $5,000 జరిమానా విధించారు. అయితే, మరింత తీవ్రమైన క్రిమినల్ అభియోగాలు మోపడానికి కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్లు నిరాకరించారు, అతను ఉద్దేశపూర్వకంగా చేసినట్టు చెప్పలేమని పేర్కొన్నారు. $29 మిలియన్ల పరిష్కారంలో సుమారు $20 మిలియన్లు నగర బీమా కంపెనీ చెల్లిస్తుందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నుంచి ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికా వెళ్లింది జాహ్నవి. సియాటిల్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. 2023 డిసెంబర్‌లో మాస్టర్స్ పూర్తి కావాల్సి ఉంది. ఇంతలోనే 2023 జనవరి 23న జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఆమెది సాధారణ కుటుంబం. తల్లి ప్రాథమిక పాఠశాల టీచర్‌గా ఉన్నారు.
Frequently Asked Questions
జాహ్నవి కందుల కేసులో అమెరికా నగరం ఎంత పరిహారం చెల్లించడానికి అంగీకరించింది?
పోలీస్ వాహనం ఢీ కొట్టినప్పుడు జాహ్నవి కందుల వేగ పరిమితిని ఎంత అతిక్రమించింది?
ప్రమాదానికి కారణమైన పోలీస్ అధికారి దాదాపు 119 కి.మీ/గం వేగంతో ప్రయాణిస్తున్నాడు, ఇది ఆ ప్రాంతంలో గరిష్టంగా 40 కి.మీ/గం వేగ పరిమితిని గణనీయంగా మించిపోయింది.
జాహ్నవి మరణం తరువాత పోలీసుల తీరుపై ఎందుకు విమర్శలు వచ్చాయి?
పోలీసు అధికారి బాడీ కెమెరాలో రికార్డు అయిన ఆడియోలో, అతను జాహ్నవి జీవితం విలువ పరిమితమని వెటకారంగా స్పందించాడు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహానికి దారితీసింది.
జాహ్నవి కందుల కేసులో బాధ్యులైన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
జాహ్నవిని కించపరిచిన అధికారి డేనియల్ ఆడెరర్‌ను, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన అధికారి కెవిన్ డేవ్‌ను విధుల నుంచి తొలగించారు. డేవ్‌కు జరిమానా కూడా విధించారు.























