Pothuluri Veerabrahmam House Collapse: కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివాసం ధ్వంసం అయింది. వరుసగా కురుస్తున్న వర్షాలు దాటికి దాదాపు 400 సంవత్సరాల క్రితం నాటి బ్రహ్మంగారి నివాసం కూలిపోవడంతో అయన భక్తులు ఆందోళన చెందుతున్నారు.
ఒకప్పుడు "కంది మల్లయ్య పల్లె " ఇప్పుడు " బ్రహ్మం గారి మఠం"
కడపకు 75 కిలోమీటర్ల దూరంలో మైదుకూరుకు 28 కిమీ దూరంలో ఉన్న బ్రహ్మంగారి మఠాన్ని ఒకప్పుడు (17వ శతాబ్దంలో) కందిమల్లయ్య పల్లెగా పిలిచే వారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఇక్కడ మఠం ఏర్పాటు చేయడంతోపాటు జీవ సమాధి కూడా ఇక్కడే చెందడంతో ఆ గ్రామం పేరు బ్రహ్మంగారి మఠంగా మారిపోయింది. ఆయన ఏర్పాటు చేసిన ఇల్లు 400 సంవత్సరాలుగా ఇక్కడే ఉంది. సామాన్య శకం 1608 నుంచి 1693 వరకూ ఆయన జీవించినట్టు అక్కడ ok బోర్డు ఉంది. వీరబ్రహ్మేంద్రస్వామి రచించిన "కాలజ్ఞానం" తెలుగు ప్రజల దృష్టిలో చాలా విలువైన భవిష్యవాణి. తన జీవ సమాధి పొందే ముందు తన కుమారుడిని మఠం వారసుడిగా నియమించారు ఆయన. అప్పటినుంచి 11 తరాలుగా ఆ వంశం వారే బ్రహ్మంగారిమఠానికి అధిపతులుగా ఉంటున్నారు. ప్రస్తుతం ఉన్న 12వ పీఠాధిపతి విషయమై కుటుంబ సభ్యుల మధ్య వివాదం ఉంది. దానితో బ్రహ్మంగారి నివాసం అభివృద్ధి ఫై వారు దృష్టి పెట్టలేదనే విమర్శ భక్తుల నుంచి వినిపిస్తూ ఉంటుంది.
పాత కాలం ఇల్లు కాబట్టే కూలిపోయింది -అధికారులు
అయితే బ్రహ్మంగారి నివాసం చాలా పాత కట్టడం కావడంతో కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు. 400 ఏళ్ల నాటి కట్టడం వర్షాలకు నాని పడిపోయిందని వారు చెబుతుండగా భక్తులు మాత్రం వీరబ్రహ్మేంద్రస్వామి నివాసం ఇలా పడిపోవడంతో విషాదంలో మునిగిపోయారు. పీఠాధిపత్యం కోసం పోటీపడే ఆయన వారసులు ఆయన జ్ఞాపకంగా నిలిచిన ఇంటిని తిరిగి బాగు చేస్తారో లేదో చూడాలని స్థానికులు అంటున్నారు.