సార్వత్రిక ఎన్నికలు మరో రెండేళ్లు ఉండగానే ఉమ్మడి అనంతపురం జిల్లాలో నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఫలితంగా ఎండ వేడికి తోడు పొలిటికల్ హీట్ రోజు రోజుకీ పెరుగుతోంది. సాధారణంగా అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు చూస్తుంటాం. కానీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాత్రం పూర్తి డిఫరెంట్. తెలుగుదేశం అంతర్గత పోరుతో సతమతమవుతోంది. 


అనంతపురం జిల్లాలో తెలుగుదేశం చెందిన అగ్రనాయకుల మధ్య మాటలు కోటలు దాటుతున్నాయి. నీకు ఈ ఎన్నికల్లో టిక్కెట్టు రాకుండా చేస్తా అంటూ ఓ నాయకుడు హెచ్చరిస్తే.. ముందు నీ సీట్ చూసుకో కనీసం మనుషుల తోడు లేకుండా 50 మీటర్లు కూడా స్వతహాగా నడవలేని నీకే టికెట్ ఉండదంటూ మరో నాయకుడి జవాబు. ఇలా మాటల తూటాలతో రాజకీయ వేడి రాజుకుంటోంది. 


ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలామంది అభ్యర్థులను మార్చాల్సి ఉందని, అప్పుడే తమ నాయకుడు చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసుకోగలుగుతామంటూ తాడిపత్రి మున్సిపల్ ఛైర్‌పర్శన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తూవస్తున్నారు. దీంతో సొంత పార్టీలోనే చాలామంది మాజీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు. 


ఈ సిరీస్‌ భాగంగా పుట్టపర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు పల్లె రఘునాథ్ రెడ్డికి టికెట్ లేకుండా చేస్తానంటూ కూడా జెసిపిఆర్ వ్యాఖ్యానించారు. ఇంతటితో ఆగకుండా పుట్టపర్తి నియోజకవర్గంలో కొంతమంది తెలుగుదేశం చోటా నాయకులు ఇళ్లకు వెళ్లి విలేకరుల సమావేశాలు నిర్వహించి పల్లె రఘునాథ్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. 


రెండు పర్యాయాలు ఇలా జరిగినప్పటికీ పల్లె నుంచి పెద్దగా దీటైన జవాబులు రాలేదు. ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటే పార్టీ పరువు పోతుంది అంటూ తమ శిబిరం మౌనంగా ఉన్నట్లు పల్లె వర్గీయులు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా గత వారంలో మరోసారి పుట్టపర్తికి వెళ్లేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నించారు. దీంతో పల్లె శిబిరం కూడా అప్రమత్తమై జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకునేందుకు సమాయత్తమైంది. జెసి గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 


ఈ వివాదాన్ని పసిగట్టిన పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టి శాంతి భద్రతలను నెలకొల్పారు. అనంతపురం నుంచి పుట్టపర్తికి ప్రభాకర్‌రెడ్డి బయలుదేరగానే మార్గమధ్యంలో రాప్తాడు నియోజకవర్గం మరూరు టోల్ ప్లాజా దగ్గర అరెస్టు చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. నేతలు ఇద్దరూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు. 


పుట్టపర్తి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా కొత్త ముఖాలు రాబోతున్నాయని పల్లె రఘునాథ్ రెడ్డికి చుక్కెదురు అవుతుందంటూ జెసిపిఆర్ చేసిన వ్యాఖ్యలు పల్లె శిబిరంలో ఆగ్రహాన్ని తెప్పించాయి. తానేమీ తక్కువ కాదంటూ మీడియా ముందుకు వచ్చిన పల్లె రఘునాథ్‌ రెడ్డి... తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డికి టికెట్ రాబోదని జోస్యం చెప్పారు. ఎందుకంటే స్వతహాగా యాభై మీటర్లు కూడా నడవలేని ప్రభాకర్ రెడ్డికి టికెట్ రాబోదని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పల్లె రఘునాథ్ రెడ్డిని ఇప్పటి వరకు ఒకవైపే చూసావు త్వరలోనే రెండో వైపును చూస్తావు అని బాలయ్య బాబు డైలాగులు పేల్చారు. ఇకపై నా మీద మాటల దాడికి దిగితే నేను కూడా విమర్శలకు దిగాల్సి వస్తుందంటూ దీటుగా జవాబిచ్చారు. ఈ విషయంలో తగ్గేది లేదంటూ పుష్ప డైలాగ్ అందుకున్నారు. 


ఇలా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకే పార్టీలో నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతుండడంతో రాజకీయ వేడి రోజు రోజుకి పెరుగుతుంది. ఈ విమర్శలు కాస్త చినికిచినికి గాలివానలా మారి రాబోయే ఎన్నికల్లో ఎవరి కొంప ముంచుతుందో అంటూ కిందిస్థాయి కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.