Peddireddy Ramachandra Reddy- కదిరి: వైనాట్ 175, వైనాట్ 200 అని అధికార వైఎస్సార్ సీపీ నినదిస్తోంది. ప్రజలు తమ వైపే ఉన్నారని, సంక్షేమ ప్రభుత్వానికి మరో ఛాన్స్ ఇస్తారని చెబుతున్నారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ సీపీ (YSRCP) రీజనల్ కోఆర్డినేటర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా మక్బూల్ ను, ఎంపీగా  శాంతమ్మ ను గెలిపించాలని ప్రజలను కోరారు. మంచి చేసి ఉంటేనే తనకు ఓటు వేయాలని సీఎం వైఎస్ జగన్ అంటున్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో వైసిపి కి మద్దతుగా నిలుద్దామని పిలుపునిచ్చారు. 


‘కరోనాతో రెండేళ్లు పోయినా ఇచ్చిన అన్ని ఎన్నికల హామీలు సీఎం వైఎస్ జగన్ అమలు చేశారు. జగన్ కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా పథకాలు అందించారు. నా రాజకీయ జీవితంలో ఇలాంటి ఒక గొప్ప ముఖ్యమంత్రిని చూడలేదు. చంద్రబాబు ఐదేళ్లు రాజదాని పేరుతో వృదా చేసి, లోపభూయిష్టంగా నాలుగు భవనాలు కట్టారు. తాత్కాలిక రాజధాని పేరుతో ప్రజాధనాన్ని, విలువైన ఐదేళ్ల సమయాన్ని వృథా చేశారు. మనకు 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. కానీ ఓటుకు కోట్లు కేసులో దొరికి చంద్రబాబు హైదరాబాద్ నుండి పారిపోయి ఏపీకి వచ్చారు. - మంత్రి పెద్దిరెడ్డి


గతంలో ఇచ్చిన హామీలు చంద్రబాబు అమలు చేయలేదు 
2014 లో ఇచ్చిన ఎన్నికల హామీలు ఏమి చంద్రబాబు అమలు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ సూపర్ సిక్స్ పేరుతో అమలు చేయడం సాధ్యంకాని హామీలు ఇస్తున్నారు. జన్మభూమి కమిటీలు టిడిపి వారికి మాత్రమే పథకాలు అందించారు. సీఎం జగన్ హయాంలో గ్రామంలో ప్రభుత్వ పాలన సాగుతోంది. కేవలం పేదరికాన్ని మాత్రమే కొలమానంగా తీసుకుని అందరికీ పథకాలు ఇచ్చారు. - మంత్రి పెద్దిరెడ్డి


ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో చదువు చెప్తున్నారు. విద్యార్థులకు షూస్ దగ్గర నుండి కావాల్సిన ప్రతి ఒక్కటి అందిస్తున్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం తాము అందిస్తామన్నారు. సీఎంగా జగన్ మరోసారి అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధితో పాటు సుపరిపాలన అందిస్తారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. నేడు గాండ్లపెంట, కదిరి రూరల్, తనకల్లు మండలాల్లో మంత్రి పెద్దిరెడ్డి పర్యటిస్తున్నారు. సీఎం జగన్‌కు ప్రజలందరూ అండగా నిలవాలని ఆయన కోరారు.