Dragon Fruit Cultivation: తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రతి ఏడాది కరువు బారిన పడే అనంత రైతు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాడు. ఇప్పటికే అనేక రకాల పండ్ల తోటల సాగు చేస్తూ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన అనంత రైతన్న మరో ముందడుగు వేశారు. సీమ జిల్లాలలో అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని అందుకు తగ్గ పంటలను సాగు చేయడంలో ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే డ్రాగన్ ఫ్రూట్ సాగుకు కొంత మంది రైతులు నడుం బిగించారు. వీరిలో అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలో రైతు రమణా రెడ్డి డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు చేసి అధిక లాభాలు గడిస్తూ మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఎకరాకు పది టన్నుల దిగుబడి...
మూడు ఎకరాల విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు చేసి ఔరా అనిపిస్తున్నారు. ఎకరాకు ఐదు లక్షల పెట్టుబడితో 2020 సంవత్సరంలో పంట సాగుకు శ్రీకారం చుట్టారు. పంట వేసిన ఏడాది నుంచే దిగుబడి సాధించారు. అయితే మొదటి ఏడాది ఎకరాకు నాలుగు టన్నుల దిగుబడి మాత్రమే వచ్చిందని మరుసటి ఏడాది ఆరు టన్నుల దిగుబడి రాగా ప్రస్తుతం ఎకరాకు పది టన్నుల దిగుబడి తీస్తున్నట్లు రైతు రమణా రెడ్డి ఆనందం వెలిబుచ్చుతున్నాడు. ఒక్కో పండు 1/2 కేజీ వరకు ఉందని పంట ఆరోగ్యంగా ఉండడంతో అధికారేటుకు విక్రయించ గలుగుతున్నామని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎకరాకు రెండువేల మొక్కలు చొప్పున మూడు ఎకరాలకు 6 వేల మొక్కలను థాయిలాండ్ దేశం నుంచి తెప్పించారు.
థాయ్ లాండ్ నుంచి మొక్కల కొనుగోలు..
జైన్ కంపెనీ టిష్యూ కల్చర్ డ్రాగన్ ఫ్రూట్ రకానికి చెందిన మొక్కలను బెంగళూరు ఎయిర్ పోర్టుకు రప్పించి అక్కడి నుంచి పొలానికి చేర్చినట్లు చెబుతున్నారు. ఒక్కో మొక్క ధర 250 రూపాయలు వంతున కొనుగోలు చేశారు. మొదట భూమిని పంటకు అనుకూలంగా మార్చుకొని పది అడుగుల దూరంతో రాతి స్తంభాలు ఏర్పాటు చేసుకోవాలని రైతు చెబుతున్నారు. ఒక్కో స్తంభానికి నాలుగు మొక్కలు వంతున నాటి సంరక్షించుకోవలసి ఉంటుందని వివరించారు. అన్ని పంటలకు వచ్చే తెగుళ్లు డ్రాగన్ ఫ్రూట్ పంటకు దరి చేరవని, కేవలం ఎర్ర చీమల దాడి ఉంటుందని వాటి నివారణకు వేప నూనె పిచికారి చేస్తే సరిపోతుంది అంటున్నారు. చీడ పీడల ఇబ్బందులు లేకపోవడం, నీటి తడులు ఎక్కువగా అవసరం లేకపోవడంతో సంవత్సరానికి ఎకరాకు 50000 వేల ఖర్చు మాత్రమే ఉంటుందని రమణా రెడ్డి చెప్పారు.
30 ఏళ్ల వరకు దిగుబడి పొందొచ్చు..
ఈ పంట ఒక్కసారి సాగు చేస్తే 25 నుంచి 30 సంవత్సరాల వరకు దిగుబడిని పొందవచ్చు అంటున్నారు. ఈ పండ్లు తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుండడంతో ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్ కు మార్కెట్లో మంచి గిట్టుబాటు ధర ఉందంటున్నారు. 50 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకోగల శక్తి ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటకు ఉందని ఇది రాయలసీమ ప్రాంత రైతులకు అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. రైతులు నిరభ్యంతరంగా పంట సాగు చేసుకోవచ్చని రైతులకు సూచిస్తున్నారు.
అధిక ఉష్ణోగ్రతలు అవసరం..
2017 సంవత్సరంలో 70 రూపాయల వంతున భారత దేశంలో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను కొనుగోలు చేసి సాగు చేశానని అయితే అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో పంట అంతా పసుపు పచ్చగా మారిపోవడంతో మొక్కలను తొలగించానని రమణా రెడ్డి చెప్పారు. కానీ థాయిలాండ్ దేశంలోని మొక్కలు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలవని తెలిసి ఆ దేశం నుంచి మొక్కలను కొనుగోలు చేసి ప్రస్తుతం అధిక దిగుబడులు పొందుతున్నట్లు ఆయన వివరించారు.