YSR Matsyakara Bharosa : వేట నిషేధం సమయంలో మత్య్సకారులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద ఆర్థికసాయం అందిస్తుంది. శుక్రవారం ఈ పథకం కింద మత్య్సకారుల ఖాతాల్లో నగదు జమకానుంది. రాష్ట్రవ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్లే 1,08,755 మత్స్యకార కుటుంబాలకు వేట నిషేద సమయం ఏప్రిల్ 15 – జూన్ 14 కాలంలో రూ. 10 వేల ఆర్థికసాయం అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు రూ. 109 కోట్ల ఆర్థిక సాయం, దీంతో పాటు ఓఎన్‌జీసీ సంస్థ పైప్ లైన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ. 108 కోట్ల ఆర్థిక సాయంతో కలిపి మొత్తం రూ. 217 కోట్లు శుక్రవారం(మే 13 , 2022)కోనసీమ జిల్లా మురమళ్ళ గ్రామంలో మత్స్యకారులకు సీఎం వైఎస్ జగన్ అందజేయనున్నారు.
మత్య్సకారులకు రూ. 10 వేల భృతి
2012లో జీఎస్‌పీసీ తవ్వకాలతో అప్పట్లో జీవనోపాధి కోల్పోయిన 14,824 మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 70.04 కోట్ల పరిహారం చెల్లించింది. శుక్రవారం అందించే ఆర్ధికసాయంతో కలిపి ఇప్పటి వరకు వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద మొత్తం సాయం రూ. 418 కోట్లు ప్రభుత్వం అందించింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం ద్వారా సముద్రంలో చేపల వేట నిషేద సమయంలో ఇచ్చే భృతిని రూ. 10 వేలకు పెంచి మర, యాంత్రిక పడవలతో పాటు సంప్రదాయ పడవలపై వేట జరిపే మత్స్యకార కుటుంబాలను కూడా చేర్చి చెల్లిస్తోంది.
డీజిల్ సబ్సిడీ రూ.9
గతంలో డీజిల్ ఆయిల్‌పై సబ్సిడీ లీటర్‌కు రూ. 6.03 ఉంటే వైసీపీ ప్రభుత్వం రూ. 9కి పెంచింది. స్మార్ట్ కార్డులు జారీ చేసి డీజిల్ పోయించుకునేటప్పుడే సబ్సిడీ లబ్ధిదారులకు నేరుగా అందేలా ఏర్పాటుచేసింది. వేట చేస్తూ మరణించిన మత్స్యకార కుటుంబాలకు చెల్లించే పరిహారం రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 3,606 కోట్ల వ్యయంతో 9 ఫిషింగ్ హర్బర్లు, 4 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. గత ప్రభుత్వం సముద్రంపై చేపల వేట నిషేద కాలంలో మత్స్యకార కుటుంబాలకు కేవలం రూ. 4 వేలు చెల్లించేది.
రేపటి షెడ్యూల్
రేపు(13వ తేదీ)న కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలో వైఎస్సార్ మత్య్సకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సీఎం జగన్ శుక్రవారం ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.20 గంటలకు ఐ.పోలవరం మండలం కొమరగిరి చేరుకుంటారు. 10.45 గంటలకు మురమళ్ళలో వేదిక వద్దకు చేరుకుని వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం సీఎం జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 12.15 గంటలకు మురమళ్ళ నుంచి బయలుదేరి 1.20 గంటలకు తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు.