Kodela Sivaram supported Kanna candidature in Sattenapalli : సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీలో ఏర్పడిన సమస్యలు పరిష్కారం అయ్యాయి. అక్కడ టీడీపీ అభ్యర్థిగా కన్నా లక్ష్మినారాయణను చంద్రబాబు ఖరారు చేశారు. కానీ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాం మాత్రం తనకే చాన్సివ్వాలని పట్టుబడుతున్నారు. సొంతంగా రాజకీయ పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అంశం పార్టీలో చర్చనీయాంశమయింది. పార్టీ నిర్ణయం ప్రకారం ఉండాలని.. భవిష్యత్ లో అవకాశాలు కల్పిస్తామని టీడీపీ ముఖ్య నేతలు కోడెల శివరాంకు హామీ ఇచ్చారు. దీంతో ఆయన కన్నా లక్ష్మినారాయణ విజయం కోసం పని చేసేందుకు సిద్దమయ్యారు.
దివంగత కోడెల టీడీపీలో సీనియర్ నేత. ఆయన పట్ల పార్టీలో అందరికీ అపారమైన గౌరవాభిమానాలు ఉన్నాయి. ఆయన కుటుంబానికి ఇతరత్రా అవకాశాలు తప్పక పార్టీ నాయకత్వం కల్పిస్తుంది. ఈ ఎన్నికల్లో అక్కడ ఉన్న పరిస్థితుల్లో సీటు గెలవాలన్న లక్ష్యంతో కన్నా లక్ష్మీ నారాయణను ఎంపిక చేశాం. పార్టీ కోసం పనిచేసి గెలిపించాలని శివరాంను కూడా కోరుతున్నాం. శివరాంతోపాటు అక్కడ టికెట్టు ఆశించిన నాయకులు అనేక మంది ఉన్నారు. వారంతా పార్టీ నిర్ణయాన్ని శిరసావహించి మద్దతు ఇస్తున్నారు. మిగిలిన వారు కూడా కలిసి రావాలని కోరుతున్నామని శివరాంకు.. అచ్చెన్నాయుడు నచ్చచెప్పారు.
అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అదే సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణను బరిలోకి దింపింది టీడీపీ. నిజానికి కన్నా లక్ష్మీనారాయణ సొంత నియోజకవర్గం పెదకూరపాడు. వరుసగా అయిదుసార్లు ఆయన ఇక్కడి నుంచి గెలుపొందారు. 2009లో గుంటూరు వెస్ట్‌కు మారిపోయారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నరసరావుపేట నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయన టీడీపీలో చేరారు. నవ్వాంధ్ర తొలి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మరణానంతరం సత్తెనపల్లిలో ఇన్‌చార్జిను నియమించలేదు. పార్టీ కార్యక్రమాలను నియోజకవర్గంలో నిర్వహించలేని దుస్థితి నెలకొంది.
కోడెల తనయుడు డాక్టర్ కోడెల శివరామ్, మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, అబ్బూరు మల్లి, నాగోతు శౌరయ్య ఇన్‌చార్జి పదవిని ఆశించారు. ఎవరికి తోచిన రీతిలో వారు పార్టీ కార్యక్రమాలను నిర్వహించారు. నలుగురు నేతలు ఉండటంతో పార్టీకి విధేయులుగా ఉన్న ద్వితీయ శ్రేణి నేతలు ఇబ్బందులకు గురవుతూ వచ్చారు. వీరిలో ఎవరికి ఇంచార్జ్ పదవి ఇచ్చినా మరో ముగ్గురు సహకరించడం కష్టం కాబట్టి.. మధ్యేమార్గంగా కన్నాకు చాన్స్ ఇచ్చారు. అయితే కోడెల శివరాం మాత్రం తనకు అవకాశం కల్పించాల్సిందేనని పట్టుబట్టారు. వివిధ కారణాలతో.. కన్నాకు కేటాయించినా ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తూనే ఉన్నారు. చివరికి రాజీ చేయడంతో సత్తెనపల్లిలో టీడీపీ కలసిపోయినట్లయింది.