Sunitha Petition: దివంగత మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పులివెందుల పోలీసులు తనపై నమోదు చేసిన కేసుపై వైఎస్ వివేకా (YS Viveka) కూతురు వైఎస్ సునీతారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై పులివెందుల పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.  ఈ సందర్బంగా పిటిషన్‌లో మార్పులు చేయాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. దిగువ కోర్టు ఆదేశాలను తొలుత సవాల్ చేయాలని, పిటిషన్‌లో సవరణలు చేసి తమను ఆశ్రయించాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణను శుక్రవారానికి హైకోర్టు వాయిదా వేసింది.


ముగ్గురిపై కేసులు


వివేకా హత్య కేసు విషయంకు సంబంధించి సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ తనను బెదిరిస్తున్నారంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశాడు. వారి ముగ్గురిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన పులివెందుల కోర్టు.. దీనిపై విచారణ జరిపి కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కోర్టు ఆదేశాల ప్రకారం వారి ముగ్గురిపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ కేసు కొట్టివేయాలని సునీత హైకోర్టును ఆశ్రయించగా..  సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ కూడా కేసును కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రామ్ సింగ్ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు.. సునీత పిటిషన్‌తో కలిపి విచారణ చేపడతామని స్పష్టం చేసింది.


పోలీసులకు ఫిర్యాదు చేసినా నో రెస్పాన్స్


తనను సునీత, రాజశేఖర్ రెడ్డి, రాంసింగ్ బెదిరిస్తున్నారంటూ తొలుత పులివెందుల పోలీసులకు వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశాడు. కొందరి పేర్లను విచారణ అధికారులకు చెప్పాలని తనను బెదిరిస్తున్నట్లు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయలేదు. పోలీసులు పట్టించుకోకపోవడంతో కోర్టును కృష్ణారెడ్డిని ఆశ్రయించాడు. తనను ఆ ముగ్గురు బెదిరిస్తున్నారని, పోలీసులను కలిసి రక్షణ కల్పించాలని కోరినా పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అందుకే తాను కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని పిటిషన్‌లో తెలిపాడు. సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే చంపేస్తామని బెదిరించారని కోర్టుకు చెప్పాడు. గత కొద్దికాలంగా ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే వారి ముగ్గురిపై కేసు నమోదు చేయాలని కోర్టు కొద్దిరోజుల క్రితం ఆదేశాలు ఇచ్చింది.  దీంతో సునీత, రాజశేఖర్ రెడ్డి, రాంసింగ్‌పై ఐపీసీ సెక్షన్ 156(3) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.


కేసును కొట్టేయాలని హైకోర్టును రాంసింగ్, సునీత ఆశ్రయించడంతో.. ఏం జరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది. వివేకా కేసులో ఎప్పుడే ఏదోక పరిణామం చోటుచేసుకుంటూనే ఉంది.  కేసులో ఉన్న నిందితులు కోర్టుల్లో అనేక పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. అలాగే ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇరుక్కోవడం పెద్ద సంచలనమైంది. గత ఎన్నికలకు ముందు నుంచి ఇప్పటివరకు ఈ కేసు జరుగుతూనే ఉంది.