Andhra Cabinet meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. దాదాపు 35 అంశాలతో కూడిన అజెండాపై చర్చించిన కేబినెట్, రాష్ట్ర పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఏపీ లాజిస్టిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఎంఎస్‌ఎంఈ (MSME)ల బలోపేతానికి ఏపీ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంకు ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల కోసం భారీ కేటాయింపులు చేసింది. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠశాల కిట్‌ల పంపిణీ నిమిత్తం రూ. 944.53 కోట్ల పరిపాలన అనుమతులు ఇచ్చింది. అలాగే శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో 'జల్ జీవన్ మిషన్' ద్వారా నీటి సరఫరా మెరుగుపరచడానికి రూ. 5,000 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ గ్యారెంటీ ఇవ్వాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించేలా రూ. 19,391 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా సుమారు 11,753 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఇంధన రంగాల్లో మొత్తం 14 సంస్థల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది. అమరావతిలో కృష్ణా నదీ తీరంలో ప్రతిష్టాత్మకమైన మెరీనా ప్రాజెక్టు ఏర్పాటుకు కూడా మంత్రివర్గం అంగీకరించింది.పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే గేమ్ ఛేంజర్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. పర్యాటక రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త వ్యూహాలను ఖరారు చేసింది.
ఎక్సైజ్ రంగంలో సంస్కరణల్లో భాగంగా బార్లలో అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును ఉపసంహరించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. సంప్రదాయేతర ఇంధన , విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా వివిధ అభివృద్ధి పనులకు ఈ భేటీలో మార్గం సుగమం చేశారు.