Key decisions taken in AP cabinet meeting:  ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం  సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.   రాష్ట్రంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడి గూగుల్ డాటా సెంటర్ తో సహా   రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపింది.   విశాఖపట్నంలో రైడెన్ ఇన్ఫోటెక్ మెగా డేటా సెంటర్, అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులు, ఉద్యోగుల డీఏ పెంపు వంటి కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మొత్తం 26 ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చారు. 

సమావేశం తర్వాత మంత్రి  పార్థసారథి మీడియాకు వివరాలు వెల్లడించారు.  సమావేశంలో అతి పెద్ద నిర్ణయం విశాఖపట్నంలో రైడెన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ చేత ఏర్పాటు చేసే హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌కు ఆమోదం. ఈ ప్రాజెక్టుకు రూ.87,520 కోట్ల పెట్టుబడి పెడతారు.  ఇది భారతదేశంలో అతిపెద్ద ఎఫ్‌డీఐలలో ఒకటిగా నిలుస్తుంది. ఈ డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ రంగాల్లో గ్లోబల్ హబ్‌గా మారుతుంది. దీని ద్వారా 67,218 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. "వైజాగ్‌ను 'ఏఐ సిటీ'గా తయారు చేయడమే లక్ష్యం" అని ప్రభుత్వం చెబుతోంది.  మరో 26 ప్రాజెక్టులకు మొత్తం రూ.27,304 కోట్ల పెట్టుబడులకు ఆమోదం ఇచ్చారు. ఇవి ఐటీ, మాన్యుఫాక్చరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ఉంటాయి.             

రాజధాని అమరావతి అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కృష్ణా నది ఒడ్డున ఏర్పాటు చేసే అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌లో గవర్నర్ రాజ్‌భవన్ నిర్మాణానికి రూ.212 కోట్లు కేటాయించారు. అలాగే, క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ)కు మరో రూ.14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. ఇందులో 25% (సుమారు రూ.3,706 కోట్లు) మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌లలో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థల నిర్మాణానికి ఉపయోగిస్తారు. ఈ ప్రాజెక్టులు 1.5 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చుతాయి. క్యాపిటల్ ఏరియాలో నాలుగు కొత్త కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం ఇచ్చారు. ఇవి గ్రీన్-సర్టిఫైడ్ భవనాలుగా ఉంటాయి. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌కు సీఆర్‌డీఏనే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా నియమించారు. ఇది రాజధానిని టెక్నాలజీ హబ్‌గా మార్చడంలో ముఖ్యమైనది. ఉద్యోగులకు డీఏ పెంపు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను 4% పెంచేందుకు చర్చించారు.  దీపావళి ముందు ఈ ప్రయోజనం అందించాలని నిర్ణయించారు.  'హ్యాపీ నెస్ట్' ,  'ఏపీ ఎన్‌ఆర్‌టీ' ప్రాజెక్టులకు బిల్డింగ్ పర్మిషన్ ఫీజులను మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  వివిధ సంస్థలకు భూముల కేటాయింపులకు ఆమోదం. ఇందులో ఐటీ, ఎడ్యుకేషన్ రంగాలకు ప్రాధాన్యత. హోటల్స్, పర్యాటక రంగంలో పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు.  ఆర్టీసీ బస్సులన్నింటినీ వచ్చే మూడేళ్లలో ఎలక్ట్రిక్ గా మార్చాలని వచ్చిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదం తెలిపింది.