Palnadu Politics Gurazala: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పల్నాడు ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర, శైలి ఉన్నాయి. అక్కడ సాగే ఫ్యాక్షన్, రాజకీయ సవాళ్లు ఎప్పుడూ కాకరేపుతుంటాయి. అయితే, తాజాగా గురజాల నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో దావానలంలా వ్యాపించాయి. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు ప్రజాస్వామ్య విలువలను, రాజకీయ నైతికతను ప్రశ్నించేలా ఉన్నాయంటూ నెటిజన్లు, విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.
కాసు మహేష్ రెడ్డి ఏమన్నారంటే.. "మనం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మొదట అభివృద్ధి గురించి ఆలోచించం. మనల్ని ఇబ్బంది పెట్టిన వారిపై, మన కార్యకర్తలను వేధించిన వారిపై పగ సాధిస్తాం, ప్రతీకారం తీర్చుకుంటాం. ఆ తర్వాతే ఏ అభివృద్ధైనా, పనైనా చూసుకుంటాం" అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ఆయన ఈ తరహా ‘ఫ్యాక్షన్’ డైలాగులు చెప్పినప్పటికీ, ఒక బాధ్యతాయుతమైన మాజీ ప్రజాప్రతినిధి నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం రాజకీయ వర్గాలను సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది.
ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కూటమి నేతలు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేస్తూ.. ఐదేళ్ల వైఎస్సార్సీపీ వినాశకర పాలనలో రాష్ట్రం ఎందుకు వెనకబడిందో చెప్పడానికి కాసు మహేష్ రెడ్డి మాటలే ప్రత్యక్ష సాక్ష్యం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలోకి వస్తే ప్రజలకు సేవ చేయాలి, ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనే ఆలోచన కాకుండా, కేవలం ప్రత్యర్థులపై కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం వారి రాక్షస మనస్తత్వానికి అద్దం పడుతోందని మండిపడుతున్నారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో పల్నాడు వ్యాప్తంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, వేధింపుల కారణంగా .. నైరాశ్యంలో ఉన్న క్యాడర్‌లో ధైర్యం నింపడానికే ఆయన అలా మాట్లాడాల్సి వచ్చిందని, దాన్ని ప్రతిపక్షాలు కావాలనే వక్రీకరిస్తున్నాయని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఒక వైపు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురదజల్లుతున్నారంటూ తాడేపల్లిలో ప్రెస్ మీట్లు పెడుతుంటే.. క్షేత్రస్థాయిలో ఇలాంటి 'పగ, ప్రతీకారం' వ్యాఖ్యలు చేయడం పార్టీ ఇమేజ్‌ను మరింత పాతాళానికి నెడుతోందని భావిస్తున్నారు.
