Kamineni Srinivas Issue: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సినీ పరిశ్రమపై జరిగిన చర్చలు రాజకీయ, సినిమా వర్గాల్లో తీవ్ర వివాదానికి దారితీశాయి. బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మూలం అయ్యాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్లినప్పుడు అవమానం చేశారని కామినేని అసెంబ్లీలో చెప్పిన అంశంతో సమస్య ప్రారంభమయింది. జగన్ ను చిరంజీవి నిలదీశారని కామినేని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలకు నందమూరి బాలకృష్ణ ఘాటుగా స్పందించారు. అక్కడ జగన్ ను ఎవరూ నిలదీయలేదన్నారు. చిరంజీవి కూడా బాలకృష్ణ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చినట్లుగా ఓ లేఖ వైరల్ అయింది.
ఈ వివాదానికి కారణం అయిన కామినేని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించమని స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లకు శనివారం అధికారికంగా అభ్యర్థించారు. అధికారిక ప్రక్రియతో వాటిని తొలగిస్తారు. దీనిపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు 'మంచి పరిణామం' అంటూ స్వాగతించారు. ఈ అంశంపై జనసేన ఎమ్మెల్యేలు కూడా స్పందించారు. జనసేన ఎమ్మెల్యేలు సుందరపు విజయ్ కుమార్, బొలిశెట్టి శ్రీనివాస్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. సభలో కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత పరిణామాలు అందరూ చూశారన్నారు. సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడటం సరికాదనే అభిప్రాయంతో ఎమ్మెల్యే కామినేని ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరడం మంచి సంప్రదాయమన్నారు. కామినేని ఆరోజు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారని..సభలో ప్రజా సమస్యల మీద మాట్లాడానికి మాత్రమే తమకు సమయం ఉంటుందని స్పష్టం చేశారు. కేవలం రాష్ట్ర ప్రజల కోసం, అభివృద్ధి కోసం మాత్రమే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని జనసేన ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు.
కామినేని చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ హీరోలను అవమానించినట్లుగా ఉండటమే కాదు.. టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరయిన బాలకృష్ణ కూడా కూడా ఖండించడంతో వివాదం అందకంతకూ పెరిగిపోయింది. ఈ క్రమంలో జగన్ పాలనలో పోలీసులు డిప్యూటీ స్పీకర్ రఘురామను కూడా హింసించారంటూ.. చెప్పే క్రమంలో ఇచ్చిన ఓ పోలిక కూాడ వివాదాస్పమయింది. ఇలా అన్ని విషయాల్లోనూ.. కామినేని శ్రీనివాస్ ప్రసంగం ఇబ్బందికరంగా మారడంతో..చివరికి ఆయన తన ప్రసంగంలో ఉన్న అభ్యంతరకమైన వాటన్నిటినీ రికార్డుల నుంచి తొలగించాలని కోరారు.
చిరంజీవి అంశం ప్రస్తావనకు రావడం.. జనసేన వర్గాలకు కూడా నచ్చలేదు. సభలో లేని వ్యక్తుల గురించి ప్రస్తావించకూడదని భావిస్తున్నారు. ఈ వివాదం పెరగకుండా ఉండాలంటే.. ఆ మాటల్ని ఉపసంహరించుకుంటే సరిపోతుదంని నిర్ణయానికి వచ్చారు. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే అయిన కామినేని.. కూటమి నేతల నుంచి వచ్చిన సలహా మేరకు వెంటనే తన మాటల్ని ఉపసంహరించుకున్నారు.