Kannababu : జగన్ ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు 2018లో విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన హత్యాయత్నంపై చంద్రబాబు ఎగతాళి చేస్తారా అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పుడైనా కోడి కత్తి చూశారా? అది ఎంత పదునుగా ఉంటుందో టచ్ చేసి చూడండి అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈమధ్య కోడి కత్తి తగిలి ఇద్దరు చనిపోయారని పత్రికలో రాశారన్నారు. జగన్ పై హత్యాయత్నం జరిగిందని ఛార్జిషీట్ లో ఎన్ఐఏ పేర్కొందని, ఇదే నిర్ధారణ జరిగిందని ఆయన అన్నారు. దీనిపై లోతైన అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. కేసు విచారణలో ఉన్నప్పుడు తీర్పులు ఇవ్వడానికి మీరెవరు మీకు ఏం హక్కు ఉంది అంటూ నిలదీశారు. నిందితుని వాంగ్మూలంతో తీర్పులు ఇచ్చేస్తున్నారని, చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఎన్ఐఏను ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేయమని కోరితే ఇబ్బంది ఏంటి?
జగన్మోహన్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థ ఎన్ఐఏను లోతుగా విచారణ చేయమని కోరితే అసలు మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదని కన్నబాబు అన్నారు. మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారని మండిపడ్డారు. చులకనగా తీసి పడేస్తే చంద్రబాబును కాపాడవచ్చనే మీ దుర్బుద్ధి కదా అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు కనీస బాధ్యత లేదా అన్నారు. కోడికత్తి భుజానికి కాకుండా మెడకు తగిలి ఉంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
నిందితునికి నేర చరిత్ర ఉంది
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై 2018 లో జరిగిన అత్యాయత్నం కేసులోని నిందితునికి నేరచరిత్ర ఉందని కురసాల కన్నబాబు అన్నారు. నిందితుడు పనిచేసే రెస్టారెంట్ ఒక టీడీపీ నేతకు చెందిందని, నేర చరిత్ర ఉన్న వ్యక్తికి విమానాశ్రయంలో ఉద్యోగం ఇస్తారా అంటూ మండిపడ్డారు.
డీఎల్ స్పృహ కోల్పోయి మాట్లాడుతున్నారు
వైఎస్ విజయమ్మ, షర్మిలకు సీఎం జగన్ మోహన్ రెడ్డితో ఆపద ఉందంటూ టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చేసిన విమర్శలకు కన్నబాబు ఘాటుగా బదులిచ్చారు. డీఎల్ స్పృహ కోల్పోయి మాట్లాడుతున్నారని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని స్పృహతో మాట్లాడాలని హెచ్చరించారు. వైఎస్ భారతి గృహిణిగా తల్లిగా పారిశ్రామిక వేత్తగా విజయం సాధించారన్నారు. వైఎస్ భారతీపై మాట్లాడేందుకు టీడీపీ నేతలకు కొంచెమైనా జ్ఞానం ఉండాలని, సంస్కారం ఉండాలంటూ అసహనం వ్యక్తం చేశారు. మహిళల పట్ల మేము ఎప్పుడైనా మాట్లాడామా.. ఇవే మాటలు మీ ఇంట్లో ఆడవారిపై మాట్లాడితే తట్టుకోగలరా అంటూ ప్రశ్నించారు.
అలిపిరి ఘటన రాజకీయ లబ్ది కోసమేనా - మంత్రి బొత్స
విశాఖ ఎయిర్ పోర్టులో కోడికత్తితో జనపల్లి శ్రీనివాసరావు అనే యువకుడు సీఎం జగన్ పై చేసిన దాడి విషయంలో ఎన్ఐఏ కౌంటర్ రిపోర్టులో ఉన్న విషయాలు విపక్ష నేతలకు ఎలా తెలుసని వైఎస్ఆర్‌సీపీ నేతలు ప్రశ్నించారు. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్‌మోహన్ రెడ్డి పై జరిగిన దాడి వాస్తవమని విద్యా శాఖామంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కోడికత్తి కేసులో ఎన్‌ఐఏ రిపోర్టును కొన్ని వార్తా సంస్థలు వక్రీకరిస్తున్నాయన్నారు. కోడి కత్తి దాడి జగన్ చేయించుకున్నారన్న భావన కల్పిస్తున్నారని మండిపడ్డారు. జగన్ పై ఎయిర్ పోర్ట్‌లో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలన్నదే తమ డిమాండ్ అన్నారు. అలిపిరిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నక్సల్స్ దాడి చేశారని... అది కూడా రాజకీయ లబ్దికోసం బాబు చేయించుకున్నారా అంటూ ప్రశ్నించారు. కోడికత్తి దాడికి పాల్పడిన శ్రీనివాస్ ఏ ఉద్దేశంతో చేశాడో తెలియాలన్నారు. ఎన్‌ఐఏ రిపోర్ట్‌లో ఏముందో ఎలా తెలిసిందని మంత్రి బొత్స ప్రశ్నించారు.