Mla Kannababu : శివరామకృష్ణ కమిటీ నివేదికను పట్టించుకోకుండా కొంతమంది స్వలాభం కోసం అమరావతిని టీడీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. పాలన వికేంద్రీకరణ జరగాలని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని శాసనసభ ఆమోదంతో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సీఎం జగన్ మొదటి నుంచి ఏదైతో చెబుతున్నారో దానినే అంతర్లీనంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. హైకోర్టు టౌన్ ప్లానర్ పాత్రను ఎలా పోషిస్తుందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి సూటిగా అడిగారన్నారు. శాసన వ్యవస్థలోకి న్యాయవ్యవస్థ చొరబడినట్లు మేము అప్పుడే చెప్పామన్నారు. న్యాయవ్యవస్థపై మాకు గౌరవం ఉందన్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు న్యాయానికి ధర్మానికి ఉన్న విలువగా భావిస్తున్నామన్నారు. సుమారు 4700 ఎకరాలను చంద్రబాబు తమ సొంత మనుషులుతో కొనిపించి ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో టీడీపీ, జనసేన కళ్లు తెరుచుకోవాలని కోరుకుంటున్నామన్నారు.
కమ్యూనిస్టు పార్టీలు అడ్డుకోవడం దారుణం
రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే చివరకు కమ్యూనిస్టు పార్టీలు కూడా అడ్డుకోవడం దారుణమని కన్నబాబు అన్నారు. చంద్రబాబు టక్కుటమార విన్యాసాలతో ఈ రాష్ట్రం ఇంకా ఎన్నాళ్లు నష్టపోవాలన్నారు. చంద్రబాబుకి తన కొడుకు బాగుండాలి తన వాళ్లు బాగుండాలి దాని కోసం ఎవరు నష్టపోయిన ఆయనకు అనవసరమని ఆరోపించారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు నాయకులు తమ నకిలీ ఉద్యమాలను కట్టిపెడితే రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. రాజధానికి 33 వేల ఎకరాలు ఎందుకు దీనిలో మోసం ఉందని గోలచేసి హడావిడి చేసిన వ్యక్తి ఈ రోజు వారితో ఎలా జతకట్టారని ప్రశ్నించారు. మీరు తప్పులు చేయబట్టే కదా రాజధాని ప్రాంతం ప్రజలు మిమ్మల్ని ఓడించారన్నారు.
న్యాయస్థానాల జోక్యం సరైంది కాదు - మంత్రి అంబటి
ఏపీ పాలిటిక్స్ మళ్లీ హీటెక్కాయి. అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఏపీ సర్కార్ కు కాస్త ఊరట లభించింది. దీంతో వైసీపీ నేతలు, మంత్రులు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. మేం ముందు నుంచీ చెప్తున్నది ఇదే అంటూ వికేంద్రీకరణ మా సిద్ధాంతం అని మరోసారి స్పష్టం చేశారు. అమరావతి అంశంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తాజా పరిణామాలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మూడు రాజధానులకు బలాన్ని ఇస్తున్నాయని తెలిపారు. రాజధానిని 3 నెలలు లేదా 6 నెలల్లోనే నిర్మించాల్సిన అవసరం లేదని మంత్రి అంబటి స్పష్టం చేశారు. రాజధానుల నిర్ణయంలో న్యాయస్థానాల జోక్యం సరైంది కాదన్నారు. అమరావతి రైతుల యాత్రకు శాశ్వత విరామం ఇచ్చినట్టే అని పేర్కొన్నారు. అమరావతి గ్రాఫిక్స్ చూపించారు తప్ప రాజధాని నిర్మాణాలు చేయలేదని విమర్శించారు. రైతుల వేషాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నారని మండిపడ్డారు. అమరావతి ప్రాంతంలోని నిజమైన రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాతైనా చంద్రబాబు, పవన్ తీరు మార్చుకోవాలని మంత్రి అంబటి రాంబాబు హితవు పలికారు. రాజధానులకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలను ఇప్పటికైనా ఆపాలన్నారు.