CM Jagan In Ontimitta : ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున శుక్రవారం రాత్రి స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న సీఎం జగన్ కు టీటీడీ చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి, ఈవో కెఎస్. జవహర్ రెడ్డి, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అర్చకులు ముఖ్యమంత్రికి తలపాగా కట్టి పళ్లెంలో పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఉంచారు. సీఎం వీటిని ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ఆలయంలో అర్చకులకు అందించి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం సీఎం జగన్ కు శేషవస్త్రం అందించి వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సీఎంకు స్వామివారి తీర్థప్రసాదాలు, ఒంటిమిట్ట రాములవారి చిత్రపటం అందజేశారు. సీఎం జగన్ వెంట మంత్రి రోజా, ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఆకేపాటి అమరనాథ రెడ్డి, ఎమ్మెల్యేలు మేడా మల్లిఖార్జున రెడ్డి, అధికారులు ఉన్నారు. అంతకు ముందు టీటీడీ అథితి గృహం వద్ద టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.
వైభవంగా సీతారాముల కల్యాణం
అంతకు ముందుకు కడప చేరుకున్న సీఎం వైఎస్ జగన్ వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కడప ఎయిర్‌పోర్ట్ నుంచి ఆయన నేరుగా ఒంటిమిట్ట చేరుకోనున్నారు. కరోనా ఆంక్షల కారణంగా రెండేళ్లుగా కల్యాణం సీతారామ కల్యాణం ఏకాంతంగా నిర్వహించారు. ఈసారి లక్షలాది భక్తుల సమక్షంలో లోకాభిరాముడి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సీతారాముల కల్యాణానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగింది.
కోదండ రామునికి బంగారు కిరీటాలు, పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ
ఒంటిమిట్ట కోదండ రామయ్య కల్యాణం సందర్భంగా తిరుమల శ్రీవారు సుమారు 400 గ్రాముల బరువు గల నాలుగు బంగారు కిరీటాలు, పట్టు వస్త్రాలు కానుకగా పంపారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శుక్రవారం ఒంటిమిట్ట ఆలయానికి చేరుకున్న ఈ కానుకలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఆలయానికి అందజేశారు. ఆలయం ఎదుట ఆభరణాలు, పట్టు వస్త్రాలకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం వీటిని ఛైర్మన్ దంపతులు ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకుని వెళ్లి అర్చకులకు అందజేశారు. కోదండరామాలయంలోని మూల మూర్తికి ఒకటి, ఉత్సవ మూర్తులకు మూడు కిరీటాలు శ్రీవారి ఆలయం నుంచి వచ్చాయి. ఆలయ ప్రాంగణంలోని యాగశాలను దర్శించి, సీతారాముల పల్లకీ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో రమణ ప్రసాద్ పాల్గొన్నారు.