ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుంటే... జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రాం మాత్రం స్పందించలేదు. శనివారం వేకువజాము నుంచి చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం నడుస్తుంటే.... ఎన్టీఆర్ మాట్లాడకపోవడంపై టీడీపీ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. సినిమా షూటింగ్ లేకపోయినా, చంద్రబాబు అరెస్టు విషయం తెలిసినా.... ఎందుకు స్పందించలేదన్నది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబుతో ఎన్టీఆర్ కు అంతగా ర్యాపో కనిపించదు. పైగా నందమూరి ఫ్యామిలీలో జరిగే కార్యక్రమాలకు ఎన్టీఆర్ అంతగా అటెండ్ కావడం లేదు. కుటుంబసభ్యులు ఆహ్వానాలు పంపినా... చాలా సందర్భాల్లో దూరంగా ఉంటున్నారు. ఒక వేళ వెళ్లినా, కార్యక్రమంలో అంటీఅంటనట్టుగా ఉంటారని టాక్.

  


కొంతకాలం క్రితం నందమూరి హరిక్రిష్ణ కూతురు సుహసిని కుమారుడి వివాహం జరిగింది.  హైదరాబాద్ లో జరిగిని ఈ పెళ్లికి తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.  చంద్రబాబు, బాలక్రిష్ణ, పురందేశ్వరితో నందమూరి కుటుంబసభ్యులు సందడి చేశారు.  వివాహానికి.. అలా వెళ్లి ఇలా వచ్చేశారు ఎన్టీఆర్. చంద్రబాబు, బాలక్రిష్ణ, ఇతర కుటుంబసభ్యులు వేడుకకు రాకముందే ఎన్టీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారట. 


ఢిల్లీలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా... వంద రూపాయల నాణెంను విడుదల చేశారు. వంద రూపాయల నాణెం విడుదల కార్యక్రమానికి ఆహ్వానం పంపినా ఎన్టీఆర్ వెళ్లలేదు. ఎన్టీఆర్ వందరూపాయల నాణెం విడుదల కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, భువనేశ్వరి, పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు. రామక్రిష్ణ ఇతర నందమూరి కుటుంబసభ్యులు వెళ్లారు. అందరూ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కల్యాణ్ రాం సైతం వంద రూపాయల నాణెం విడుదల కార్యక్రమానికి వెళ్లలేదు. 


అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా ఎన్టీఆర్ సరైన రీతిలో స్పందించలేదని టీడీపీ అభిమానులు, కార్యకర్తలు మండిపడ్డారు. కర్ర విరగకుండా, పాము చావకుండా అన్నట్లు, ఎన్టీఆర్, కల్యాణ్ వీరిద్దరూ వ్యవహరించారని కామెంట్స్ వచ్చాయ్. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనన్న ఆసక్తితో అందరూ ఎదురు చూశారు. ఆయన చేసిన ట్వీట్ ఎవరినీ నొప్పించక.. అన్నట్లుగా ఉందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


హరికృష్ణ మరణం తర్వాత ప్రధానంగా ఆయన కుటుంబంలోని జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు తెలుగుదేశం పార్టీకి, నారా వారి ఫ్యామిలీకి దూరంగా ఉంటూ వస్తున్నారని పార్టీలోనూ చర్చ జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు కూడా హరిక్రిష్ణను పట్టించుకోలేదన్న భావనలో ఉన్నారు.  రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలనుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ ఎపిసోడ్ లో కూడా మమ అనిపించేలా వ్యవహరించారని చర్చించుకుంటున్నారు. మొత్తం మీద నందమూరి కుటుంబంలో క్రేజ్ ఉన్న వారిలో బాలకృష్ణ తప్పించి హరికృష్ణ కుటుంబం దూరంగానే ఉన్నట్లు కనిపిస్తోంది.


టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినా... ఏ1 ముద్దాయిగా పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడకు తీసుకెళ్లే సమయంలో పలు ప్రాంతాల్లో కార్యకర్తలు కాన్వాయ్ కు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మహిళలు... చంద్రబాబు కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా అడ్డగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బాబు అరెస్ట్ పై నిరసనలు వ్యక్తమవుతున్నాయ్.