JC Prabhakar Reddy Vs ASP Rohit Kumar Chowdhury: అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి మధ్య వివాదం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విద్యుత్ శాఖకు సంబంధించిన ఓ అంశంలో ఏర్పడిన వివాదం కారణంగా ..కేసులు నమోదయ్యాయి. జేసీ వర్గీయులపై కేసులు నమోదు కావడంతో ప్రభాకర్ రెడ్డి .. ఏఎస్పీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట తాడిపత్రి యాడికి ప్రాంతంలోని విద్యుత్ శాఖ ఆఫీస్‌లో జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ASP రోహిత్ కుమార్ చౌదరి కేసు నమోదు చేశారు. ఇది జేసీని ఆగ్రహానికి గురి చేసింది. జేసీ మీడియాతో మాట్లాడుతూ ASPని అవినీతి అధికారి అంటూ ఆరోపించారు. కాంట్రాక్టర్ల నుంచి భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నాడని ఆరోపించారు. తాజాగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఏ ఎస్పీని తాను ఎక్కడా చూడలేదన్నారు. రోహిత్ కుమార్ చౌదరి ఏ ఎస్పీగా పనికి రాడు..రాళ్ల దాడి జరుగుతుంటే ఇంట్లో కూర్చొని ఘర్షణ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడని ఆరోపించారు.
తాడిపత్రిలో నువ్వు వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గలేదు.. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందని.. నువ్వు బయటికి రావాలంటే ఎస్ఐ, సీఐ, కానిస్టేబుల్ లేనిది బయటికి రాలేవన్నారు. గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడుపై కూడా మండిపడ్డారు. దాడులు చేస్తామని హెచ్చరించారు. గతంలో వైసీపీ హయాంలో డీఎస్పీగా ఉన్న చైతన్యపై ఆరోపణలు చేసేవారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు డిఎస్‌పి చైతన్య కంటే ఎఎస్‌పి పనికి రాని వ్యక్తి అని, రోహిత్ ఇంటికి ముందుకొచ్చి పడుకొని నిరసన తెలిపితే జవాబు లేదన్నారు. ఎస్‌పిని చూసి మౌనంగా ఉన్నానని లేదంటే ఇంట్లోకి దూరేవాడినని ప్రభాకర్ రెడ్డి హ హెచ్చరించారు. ఐదేళ్లు కష్టపడితేనే ఈ స్థితిలో ఉన్నానని, భార్య పిల్లలను అందరిని మావాళ్లు పొగొట్టుకున్నారన్నారు.
బుధవారం ఎఎస్ పి దమ్ముంటే అడ్డుకోవాలని సవాల్ విసిరారు. ఇప్పటి వరకు 130 కేసులు ఉన్నాయని, మరో పది కేసులు పెట్టిన కూడా భయపడనని, తన జీవిత కాలంలో మర్యాదగా బతికానని మర్యాదగానే చస్తానన్నారు. తనకు ఎవరంటే భయం లేదని, తాను రాజకీయాలు చేయడానికి రాలేదని, తనకు పోలీసులంటే భయం లేదన్నాడు. ఎఎస్ పి తో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పోలీసులకు చాలా మర్యాద ఇస్తామని, రోహిత్ మరో చైతన్య మారారని ఎద్దేవా చేశారు. తన దగ్గర ఉన్న అన్ని రికార్డులు తీసుకుని పోలీసుల ముందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి వస్తానని జెసి సవాల్ విసిరారు.
మరో వైపు ఏఎస్పీ రోహిత్ కుమార్ పోలీసుల జోలికొస్తే తాట తీస్తానంటూ పరోక్షంగా జెసి ప్రభాకర్ రెడ్డి ఉద్దేశించి హెచ్చరించినట్లుగా ప్రచారం జరుగుతోంది. తాడిపత్రిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎఎస్ పి హెచ్చరికలు జారీ చేశారు.