Pawan To Kondagattu : జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వారాహీ వాహన పూజ, నారసింహ యాత్రలో భాగంగా మంగళవారం కొండగట్టు, ధర్మపురిల్లో ప్రయటించనున్నారు. ఇందు కోసం రూట్ మ్యాప్ ను జనసేన వర్గాలు విడుదల చేశాయి. కొంటగట్టుకు పవన్ కళ్యాణ్ ఉ.11 గంటలకు చేరుకొని, ఆలయంలో ప్రత్యేక పూజ తర్వాత 'వారాహి'కి పూజలు చేస్తారు.. మ. 2 గంటలకు కొడిమ్యాల (మం) నాచుపల్లిలో ముఖ్య నేతలతో భేటీ అవుతారు. అనంతరం సా. 4 గంటలకు ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. సా. 5 గంటలకు పార్టీ కార్యకర్తలతో సమావేశం ఉంటుంది. అనుష్టుప్ నారసింహ యాత్ర పేరుతో 32 నారసింహ క్షేత్రాల సందర్శనను పవన్ కల్యాణ్ చేపట్టారు. ఇందులో మొదటి ఆలయంగా ధర్మపురి ఆలయాన్ని సందర్శిస్తారు.
తెలంగాణలో పోటీచేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను జనసేన చేస్తోంది. తెలంగాణలో కూడా పోటీచేసేందుకు క్యాడర్ సిద్ధంగా ఉండాలంటూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు 32 నియోజకవర్గాల్లో కార్యనిర్వాహకులను ఎంపిక చేసినట్లు తెలంగాణ జనసేన ఇన్ఛార్జి శంకర్ గౌడ్ వెల్లడించారు. వీరికి కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటించి అధినేతకు నివేదిక అందజేస్తారని, ఆ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటనలు ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది.
ఇటీవల బీఆర్ఎస్ పార్టీలోకి జనసేన నేతలే ఎక్కువగా చేరారు. బీఆర్ఎస్ పార్టీ ఏపీలో కాపు సామాజికవర్గాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది..ఇది పవన్ కల్యాణ్ ను బలహీనపర్చడానికేనన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తెలంగాణలో కాపు సామాజికవర్గం ఓట్లను తమ పార్టీకి ఆకర్షించి.. కేసీఆర్ కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణలో కాపు సామాజికవర్గ ఓట్లు నిర్ణయాత్మకంగా ఉన్నారు. మున్నూరు కాపు సామాజికవర్గం ఎవరికి అండగా నిలిస్తే వారికి అధికారం లభిస్తుందన్న అంచనా ఉంది. ఏపీలో కాపుల్ని ఆకట్టుకుంటే.. తెలంగాణలో ఆ వర్గం కూడా బీఆర్ఎస్‌కు అండగా ఉంటుందని కేసీఆర్ ప్లాన్ చేసుకున్నారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
కారణం ఏదైనా పవన్ కల్యాణ్.. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పై తీవ్రమైన విమర్శలు చేయడం లేదు. గతంలో బీజేపీతో పొత్తు ఉంది. గ్రేటర్ ఎన్నికల్లో ఆ పార్టీ కోసం అభ్యర్థుల్ని విరమించుకున్నారు . కానీ తర్వాత పొత్తు చెడిపోయింది. గౌరవం ఇవ్వడం లేదని.. అలాంటి చోట పొత్తు ప్రశ్నే ఉండదని పవన్ తేల్చి చెప్పారు. బీజేపీ నేతలు కూడా తమకు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని చెబుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో పవన్ చేయబోయే రాజకీయం ఆసక్తికరంగా మారింది. పవన్ పర్యటనకు వచ్చే స్పందనను బట్టి తదుపరి నిర్ణయాలను ఆ పార్టీ నేతలు తీసుకునే అవకాశం ఉంది.