Pawan Helicopter Tours: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో బిజీగా ఉంది. ఆ పార్టీ ముఖ్యనేతలంతా గత కొద్ది వారాలుగా పిఠాపురంలో ఆవిర్భావ సభ నిర్వహణపైనే దృష్టి పెట్టారు. శుక్రవారం జరగనున్న సభ కోసం పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. అయితే ఈ సభ విషయంలో వైసీపీ కొద్ది రోజులుగా విమర్శలు చేస్తోంది. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ టూర్ షెడ్యూల్ ను పోస్టు చేసిన వైసీపీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ .. విమర్శలు గుప్పించింది. గన్నవరం నుంచి మంగళగిరిలోని పార్టీ ఆఫీసుకు హెలికాఫ్టర్ లో వస్తున్నారని ఇదేం దుబారా అని .. ప్రజాధనం వృధా చేస్తున్నారని మండిపడింది.
దీనికి జనసేన పార్టీ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. వ్యక్తిగత సంపాదన డబ్బుతో పవన్ హెలికాప్టర్ లో వెళ్ళడానికి, ప్రజల సొమ్ముతో సీఎంగా ఉన్న జగన్ 5 కిమీ కూడా హెలికాప్టర్ లో వెళ్ళడానికి తేడా ఉందని ..రెండూ ఒకటి కాదన ిట్వీట్ చేశారు. ఆకాశం మీద ఉమ్మేయాలని చూస్తే వైసీపీ మొహం మీద పడినట్లుగా ఉందని విమర్శలు గుప్పించారు.
పవన్ కల్యాణ్ పార్టీ పరమైన కార్యక్రమాల కోసం వెళ్తున్నారు. ఆయన పూర్తిగా పార్టీ ఖర్చుతోనే పర్యటనలు చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన నిధులను ఆయన వినియోగించుకోవడం లేదు. అయితే వైసీపీ సోషల్ మీడియా కార్యక్తర్తలు మాత్రం ఇదంతా ప్రజాధనం అనే ఆరోపిస్తున్నారు.
పవన్ కల్యాణ్ గన్నవరం నుంచి మంగళగిరికి హెలికాఫ్టర్ లో వెళ్లడానికి కారణాలు ఉన్నాయి. ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఆయన కాన్యాయ్ రోడ్డు మీదకు వస్తే వెళ్లే దారిలో ట్రాఫిక్ ఆపాల్సి ఉంటుంది. దాని వల్ల ఎంతో మంది ఇబ్బంది పడతారు. అందుకే పవన్ హెలికాఫ్టర్ రైడ్ ను ఎంచుకున్నారు. కానీ దీనిపై వైసీపీ విమర్శలు చేయడంతో గట్టి కౌంటర్ ఇచ్చినట్లయింది.
పిఠాపురం సభకు పెద్ద ఎత్తున జన సైనికులు హాజరవుతున్నారు. ఆ సభలో పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్ పై జనసైనికులకు దిశానిర్దేశంచేయనున్నారు. వైసీపీపై ఘాటు విమర్శలతో విరుచుకుపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.