పచ్చదానాన్ని చేజేతులారా నాశనం చేసి ప్రకృతి విపత్తులకు కారణం అయ్యాం. నీళ్లుకొనుక్కునే దశ నుంచి గాలికొనుక్కునే స్థితికి చేరాం. ఇలాంటి పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పలు ప్రభుత్వాలు అడుగులేస్తున్నాయి. వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం ప్రారంభించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంది. మంగళగిరి ఎయిమ్స్‌లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొననున్నారు.





జాతీయ అటవీ విధానానికి అనుగుణంగా 33 శాతం పచ్చదనాన్ని పెంపొందిస్తూ.. తద్వారా ఆకుపచ్చని ఆంధ్రావని సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఏటా వర్షా కాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీశాఖ నిర్వహిస్తుంది. ఈ సారి దాన్ని భారీ ఎత్తున చేపట్టింది. ఇందులో భాగంగా జగనన్న పచ్చ తోరణం, వన మహోత్సవం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా  ప్రారంభం కానుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఆవరణలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం మంగళగిరి ఎయిమ్స్‌లో మొత్తం రెండు వేల మొక్కలను నాటతారు.


అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు నర్సరీలు, టింబర్‌ మిల్లులు, సామాజిక వనాల్లో ఏటా వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీ శాఖ చేపడుతుంది. ఈ సారి వాటితో పాటు 17 వేల వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లోనూ మొక్కలు నాటనున్నారు. నాడు–నేడు పథకంలో భాగంగా పాఠశాలలు, ఆస్పత్రుల్లో మొక్కలు నాటించనున్నారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో 33.23 కోట్ల మొక్కలు నాటినట్టు అటవీ శాఖాధికారులు చెప్పారు. వర్షాకాలం ముగిసేంత వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.


వన మహోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్, టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. పచ్చదనంలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందని, దానిని ప్రథమ స్థానానికి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. మొక్కలు నాటడమే కాక వాటిని పరిరక్షించాలని మంత్రి చెరుకువాడ సూచించారు. సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొనే కార్యక్రమాన్ని కొవిడ్‌19 నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎయిమ్స్‌ ఆవరణలో సీంఎ వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నందున జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి…. సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లు పరిశీలించిన వారిలో అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి విజయ్‌కుమార్, గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌, జేసీ దినేష్‌కుమార్‌ ఉన్నారు.