Employees Meet CM Jagan :    ఉద్యోగుల విషయంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను 60 రోజుల్లోగా అమలు చేయాలని అధికారులకు సీఎం జగన్  ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగ సంఘాల నేతల ప్రతినిధులు తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిశారు.   కొత్తగా జీపీఎస్ ను తీసుకురావడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఏపీవీవీపీ ఉద్యోగుల విలీనం, పీఆర్సీ కమిషన్‌ఏర్పాటు సహా రాష్ట్ర కేబినెట్, ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేశారు.   ప్రభుత్వం నుంచి జరగాల్సిన మంచి ఏదైనా ఉద్యోగులకు చేస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు.  ఉద్యోగులు అనేవారు ప్రభుత్వంలో భాగస్వాములని..   ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని విశ్వసించిన ప్రభుత్వం మనదని  జన వారికి చెప్పారు.  మీ మనసులో కష్టం ఉండకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమన్నారు. 


అందుకే పెన్షన్సహా కొన్ని పరిష్కారాలకోసం రెండేళ్లుగా తపనపడ్డామని..  గతంలో ఎవ్వరూ కూడా ఈ సమస్యలకు పరిష్కారం చూపించడానికి తపనపడ్డ సందర్భాలు లేవని గుర్తు చేశారు.  ఉద్యోగులకు పరిష్కారం దొరకాలి, అంతేకాకుండా భావితరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉందన్నారు.  దీన్ని దష్టిలో ఉంచుకుని జీపీఎస్ను తీసుకువచ్చామన్నారు.  రిటైర్డ్‌ఉద్యోగుల జీవన ప్రమాణాలను కూడా నిలబెట్టేదిగా జీపీఎస్ను రూపొందించామని..  62 ఏళ్లకు రిటైర్‌అయితే 82 ఏళ్లలో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలని జగన్ ఆకాంక్షించారు.  అందుకే ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డీఆర్లు ఇచ్చేలా జీపీఎస్‌లో పొందుపరిచామన్నారు.  ఉద్యోగులకు న్యాయం జరగాలి, మరోవైపు నడపలేని పరిస్థితులు కూడా రాకుండా ఉండాలన్నారు. 


సీపీఎస్‌లో లేనివి జీపీఎస్‌లో ఉన్నాయని జగన్ చెప్పారు. రెండేళ్లపాటు జీపీఎస్‌పై ఆర్థికశాఖ సుదీర్ఘకసరత్తు చేసింది. దీని ఫలితంగానే జీపీఎస్‌ను రూపకల్పన చేశామన్నారు.  కాంట్రాక్ట్‌ఉద్యోగుల క్రమబద్ధీకరణపైనా కూడా మంచి ఆలోచన చేశామని..   సుప్రీంకోర్టు తీర్పులనుకూడా పరిగణలోకి తీసుకున్నామన్నారు.  వారికి మంచి చేయాలన్న ఆలోచనతో అడుగులు ముందుకేశామన్నారు.  అలాగే వైద్యవిధాన పరిషత్‌ఉద్యోగులనుకూడా ప్రభుత్వంలో విలీనం చేసి..  వారికీ మంచి పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. 
 


రెండు రోజుల కిందట జరిగిన ఏపీ కేబినెట్  భేటీలో  సీపీఎస్ స్థానంలో జీపీఎస్ గ్యారెంటీ పెన్షన్ స్కీం బిల్లు ముసాయిదాను ఇవాళ కేబినెట్ భేటీలో ఆమోదించింది. ఉద్యోగుల భద్రత కోసం సీపీఎస్ స్థానంలో ఏపీ జీపీఎస్ బిల్లు తీసుకొచ్చినట్లు ప్రకటించింది. జిల్లా కేంద్రాల్లో పనిచేసేవారికి 12 శాతం నుంచి 16శాతం హెచ్‌ఆర్‌ఏను పెంచింది. ఇక, 12వ పీఆర్సీ నియామకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్‌ అమలుకు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పాత ఫించను పథకానికి సమానండే ఉండేలా ఈ పథకాన్ని రూపకల్పన చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తరువాత వచ్చే 50 శాతం ఫించనకు తగ్గకుండా, డీఏ క్రమంగా పెరిగేలా కొత్త విధంగా కొత్త బిల్లును రూపొందించారు. గ్యారెంటెడ్ పెన్షన్ బిల్ 2023 పేరుతో బిల్లు ముసాయిదాను కేబినెట్ ఆమోదించింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల(2014, జూన్‌ 2 నుంచి పని చేస్తున్నవాళ్లు) క్రమబద్దీకరణకు ఆమోదం తెలిపింది.