ISRO is launching a satellite made by a student of Mohan Babu University :  మంచు విష్ణు కీలక ప్రకటన చేశారు. తమకు చెందిన మోహన్ బాబు యూనివర్శిటీకి చెందిన విద్యార్థి ఒకరు శాటిలైట్ తయారు చేశారని దాన్ని ఇస్రో సాయంతో శనివారమే నింగిలోకి లాంచ్ చేస్తున్నామని ప్రకటించారు. ఇందు కోసం నేషనల్ అట్మోస్ఫరిక్ రీసెర్చ్ లేబోరేటరీ సాయం చేసిందన్నారు. అయితే ఎప్పుడు ఎక్కడ ఎలా లాంచ్‌ చేస్తారు.. దాన్ని ఎవరైనా చూడవచ్చా.. ఆ శాటిలైట్ ఎలాంటి పనితీరు చూపిస్తుంది.. అనే అంశాలపై మిగతా వివరాలు వెల్లడించలేదు. 






 


మూడు దశాబ్దాల కిందట శ్రీవిద్యానికేతన్‌ను ప్రారంభించిన మోహన్ బాబు                            


మాజీ పీటీ టీచర్ అయిన మోహన్ బాబు ..తను సినిమాల్లో కాస్త నిలదొక్కుకున్న వెంటనే  తన సొంత ఊరు అయిన తిరుపతి సమీపంలో విద్యా సంస్థ నెలకొల్పారు. శ్రీ విద్యానికేతన్ పేరుతో మొదట స్కూలుగా ఏర్పడిన ఆ సంస్థ అంతకంతకూ పెరిగింది. ఇంజినీరింగ్ కాలేజీల వరకూ విస్తరించింది.  ఆ సంస్థల్ని మోహన్ బాబు యూనివర్సిటీ గా గత ఏడాది ప్రకటించారు.  శ్రీ విద్యానికేతన్ లో నాటిన విత్తనాలు నేడు కల్పవృక్షంగా ఎదిగాయని..  మీ 30 ఏళ్ల నమ్మకం, నా జీవితం లక్ష్యం కలగలిపి ఇన్నోవేటివ్ లెర్నింగ్ యూనివర్సిటీగా రూపాంతరం చెందిందని యూనివర్శిటీ ప్రకటన సమయంలో మోహన్ బాబు చెప్పారు.  


ఏడాది కిందట మోహన్ బాబు యూనివర్శిటీగా మార్పు                 


మోహన్ బాబు యూనివర్శిటీ బాధ్యతలను ప్రస్తుతం మంచు విష్ణునే చూసుకుంటున్నారు. ఆయనే యూనివర్శిటీని మరింతగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారని అంటున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల సృజనాత్మక ప్రయత్నాలను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తున్నారు. ఇంజినీరింగ్ కాలేజీల్లో విద్యార్థులు శాటిలైట్ రూపొందించేందుకు ఆసక్తి చూపించడంతో ప్రోత్సహించారు. ఇతర సంస్థల  మద్దతు వచ్చేలా చూశారు. ఇప్పుడు వారు శాటిలైట్ సిద్ధం చేయడం చూసి ఇస్రో కూడా అబ్బురపడినట్లుగా తెలుస్తోంది. అందుకే ఆ శాటిలైట్ ను లాంచ్ చేయడానికి ఒప్పుకున్నదని చెబుతున్నారు. 


ప్రస్తుతం ఎంబీయూ బాధ్యతలు చూసుకుంటున్న మంచు విష్ణు           


అయితే ఇంకా  పూర్తి డీటైల్స్ ను మంచు విష్ణు ప్రకటించలేదు. ఆ శాటిలైట్ ఎలాంటి.. నిజమైన శాటిలైటా లేకపోతే రిప్లికానే అన్నది లాంచింగ్ తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో అంతరిక్షంపై ఆసక్తి చూపుతున్న యువత పెరుగుతోంది. ప్రైవేటు రంగంలోనూ అవకాశాలు పెరుగుతున్నాయి. ఎక్కువ మంది విద్యార్తులు ఈ రకమైన పరిశోధనల వైపు ఆసక్తి చూపిస్తున్నారు.