CM Jagan News :  ఏపీ సీఎం  జగన్మోహన్ రెడ్డి వారం రోజుల పాటు యూరప్ పర్యటనకు వెళ్లాలనుకున్నారు. అందు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఇప్పుడు పర్యటన రద్దయిందనే ప్రచారం జరుగుతోంది. కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో మారుతున్న పరిణామాలతో తాను విదేశీ పర్యటనకు వెళ్లడం కరెక్ట్ కాదన్న అభిప్రాయంలో సీఎం జగన్ ఉన్నారంటున్నారు. షెడ్యూల్ ప్రకారం 21వ తేదీన  లండన్ వెళ్లాల్సి ఉంది. 


వివేకా కేసు పరిణామాలపై కీలక నేతలతో వరుసగా చర్చలు


 తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ ముఖ్య నేతలతో వరుసగా రెండు రోజుల నుంచి చర్చలు జరుపుతున్నారు. కేసుకు సంబంధించిన అంశాలపై చర్చించడంతో పాటు న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని మరోసారి ఢిల్లి పెద్దల దృష్టికి తీసుకెళ్లే యోచనలో సీఎం జగన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రెండు, మూడు రోజుల్లో ఢిల్లి వెళ్లి కేంద్ర పెద్దలతో సీఎం జగన్‌ సమావేశం అవుతారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అందులో భాగంగానే లండన్‌ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఇంకా  విదేశీ పర్యటన రద్దు... జగన్ ఢిల్లీ పర్యటన ఖరారు కాలేదు. 


పరిస్థితిని చక్కదిద్దేందుకు జగన్ ప్రయత్నాలు


టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి  ప్రస్తుతం జగన్ టీమ్‌లో కీలకంగా ఉన్నారు. అన్ని పనులు వీరే చక్క బెడుతున్నారు.  భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయండతో సీఎం జగన్‌ అనంతపురం పర్యటనను  రద్దు చేసుకున్నారు.  కేసు వ్యవహారంపైనే ముఖ్య నేతలతో పాటు న్యాయ నిపుణులతో చర్చించినట్లు చెబుతున్నారు.   సీబీఐ కేసు వ్యవహారంలో చోటుచేసుకుంటున్న ప్రతి చిన్న అంశాన్ని కూడా తెలుగుదేశం ఇతర పార్టీలన్ని రాజకీయం చేస్తున్నాయని వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని జగన్ పార్టీ ముఖ్య నేతలకు సూచించినట్లుగా చెబుతున్నారు.  ఈ అంశంపై ఎవరూ, ఎక్కడ మాట్లాడవద్దని, ఒక వేళ మాట్లాడాల్సి వస్తే పార్టీ కేంద్ర కార్యాలయంలో సమాచారం తీసుకుని మాట్లాడేలా ఉండాలని, అస్పష్టతతో ఎవరూ మాట్లాడకుండా చూడాలని ముఖ్య నేతలకు జగన్‌ సూచించినట్లు తెలుస్తోంది. 


కర్ణాటక ఎన్నికల బిజీలో బీజేపీ పెద్దలు - అపాయింట్‌మెంట్లు ఇస్తారా ?                 


ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అంతా కర్ణాటక ఎన్నికలపై దృష్టి పెట్టి ఉన్నారు. బీజేపీ అగ్రనేతలు అక్కడ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సమయం ఇస్తారా అన్నది క్లిష్టమైన విషయమే. అయితే మోదీ, అమిత్ షాల అపాయింట్‌మెంట్  కోసం .. వైసీపీ ముఖ్య నేతలు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సమయం దొరికితే.. రెండు రోజుల్లో జగన్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. విదేశీ పర్యటన రద్దుపై స్పష్టమైన ప్రకటన చేయనప్పటికీ అనధికారికంగా క్లారిటి వచ్చిందని.. అందుకే విద్యా దీవెన పథకానికి 26న బటన్ నొక్కుతారని ప్రకటించారని అంటున్నారు.