Kadiri Registrar Office: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వెలుగుచూస్తున్న భూ అక్రమాల పర్వం జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. బీజేపీ సీనియర్ నేత ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి ఈ వ్యవహారంపై కలెక్టర్‌కు మరోసారి ఫిర్యాదు చేయడంతో రిజిస్ట్రేషన్ శాఖలో వేళ్లూనుకున్న అవినీతి నెట్వర్క్ మళ్లీ తెరపైకి వచ్చింది.  

Continues below advertisement

 రికార్డుల తారుమారు.. రిజిస్ట్రేషన్ల దందా 

శ్రీ సత్యసాయి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, ముఖ్యంగా కదిరి కేంద్రంగా నకిలీ డాక్యుమెంట్ల దందా యథేచ్ఛగా సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ రికార్డులను అక్రమంగా తారుమారు చేస్తూ, ప్రభుత్వ భూములను సైతం ప్రైవేట్ వ్యక్తుల పరం చేస్తున్న వైనంపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో తాము ఇచ్చిన ఫిర్యాదులపై అధికారులు ఇంతవరకు సరైన చర్యలు తీసుకోలేదని, రెవెన్యూ అధికారుల అండదండలతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని ఆయన చెబుతున్నారు. 

Continues below advertisement

అధికారుల లాగిన్‌లతో ప్రైవేటు వ్యక్తుల పనులు

కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ల  హవా కొనసాగుతోంది. అధికారుల లాగిన్ ఐడిలను సైతం ప్రైవేట్ వ్యక్తులు వాడుతూ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో కొన్ని వివాదాస్పద భూములకు సంబంధించి కోర్టు స్టే ఉన్నప్పటికీ, రికార్డులను గల్లంతు చేసి రిజిస్ట్రేషన్లు నిర్వహించిన ఘటనలపై అప్పట్లో ప్రాథమిక విచారణ జరిగినా, రాజకీయ ఒత్తిళ్లతో అవి మూలపడ్డాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

కలెక్టర్ సానుకూల స్పందన - విచారణకు ఆదేశం 

విష్ణువర్ధన్ రెడ్డి అందజేసిన ఆధారాలను పరిశీలించిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఈ వ్యవహారంపై  స్పందించారు. నకిలీ డాక్యుమెంట్లు, రికార్డుల తారుమారుపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి, అక్రమాలకు పాల్పడే అధికారులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని, విచారణ నివేదిక ఆధారంగా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. 

 ఉద్యమ బాటలో బీజేపీ                                     

ఈ అక్రమాలపై కేవలం ఫిర్యాదులకే పరిమితం కాకుండా, బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు పోరాడతామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో రెవెన్యూ యంత్రాంగం విఫలమైందని, అవినీతి అట్టడుగు స్థాయి వరకు పేరుకుపోయిందని  అంటున్నారు.  కలెక్టర్ ఆదేశించిన విచారణతోనైనా ఈ భారీ భూ కుంభకోణం వెనుక ఉన్న అసలైన సూత్రధారులు బయటపడతారో లేదో చూడాలి.