IPS PV Sunil vs Raghurama politics: ఏపీ రాజకీయాల్లో సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ , అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు (RRR) మధ్య సాగుతున్న ఖాకీ వర్సెస్ ఖాదీ వార్ ఇప్పుడు పరాకాష్టకు చేరింది. ఒక ఐపీఎస్ అధికారి, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిపై బహిరంగంగా విమర్శలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నేరుగా రాజకీయాలు చేస్తున్న పీవీ సునీల్
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో మొదలైన పీవీ సునీల్ కుమార్ , రఘురామ కృష్ణరాజు మధ్య విభేదాలు ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగాయి. గతంలో రఘురామను సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలపై సునీల్ కుమార్ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉండి విచారణను ఎదుర్కొంటున్నారు. అయితే, సోషల్ మీడియా వేదికగా సునీల్ కుమార్ నేరుగా రఘురామను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. రఘురామను 420 అని సంబోధిస్తూ, ఆయనపై ఉన్న బ్యాంకు మోసం కేసుల్లో యావజ్జీవ శిక్ష పడటం ఖాయమని, వెంటనే ఆయన్ను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తప్పించాలని సునీల్ కుమార్ డిమాండ్ చేయడం ఇప్పుడు దుమారం రేపుతోంది.
సర్వీస్ రూల్స్ ఏం చెబుతున్నాయి?
ఐపీఎస్ అధికారిగా ఉంటూ రాజకీయ నేతలపై బహిరంగ విమర్శలు చేయడం All India Services (Conduct) Rules, 1968 కు విరుద్ధమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నిబంధనల ప్రకారం ఐపీఎస్ అధికారులు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడకూడదు. రాజకీయ అంశాలపై అభిప్రాయాలు వ్యక్తం చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది. అధికారంలో ఉన్న ప్రభుత్వం నియమించిన రాజ్యాంగబద్ధ పదవి పై వ్యాఖ్యలు చేయడం పరోక్షంగా ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేయడమే అవుతుంది. అధికారులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తులపై వ్యక్తిగత దూషణలు చేయడం, విచారణలో ఉన్న కేసులపై ముందే తీర్పులు చెప్పడం సర్వీసు నుంచి తొలగించే స్థాయి నేరం కావచ్చునని నిపుణులు చెబుతున్నారు.
రఘురామ కౌంటర్ ఎటాక్
సునీల్ కుమార్ వ్యాఖ్యలపై రఘురామ కృష్ణరాజు తీవ్రంగా స్పందించారు. ఒక అధికారి అయి ఉండి, నేరస్తుడిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సునీల్ కుమార్‌ను కేవలం సస్పెండ్ చేస్తే సరిపోదని, ఆయనను శాశ్వతంగా సర్వీసు నుంచి డిస్మిస్ చేయాలని కోరుతూ రఘురామ ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని, సునీల్ కుమార్ 'రెడ్డి బుక్' సభ్యుడిలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
న్యాయపరమైన చిక్కులు
సునీల్ కుమార్ కేవలం రాజకీయ వ్యాఖ్యలే కాకుండా, రఘురామపై ఉన్న బ్యాంకు మోసం కేసులో తాను కూడా బాధితుడిగా ఇంప్లీడ్ అవుతానని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. అయితే, సిట్టింగ్ ఐపీఎస్ అధికారి ఇలా వీధి పోరాటాలకు దిగడం వల్ల భవిష్యత్తులో ఆయన తన సర్వీసును పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆయనపై కస్టోడియల్ టార్చర్ కేసు ఉండగా, ఇప్పుడు సర్వీస్ రూల్స్ ఉల్లంఘన కూడా తోడైతే ఆయన కెరీర్‌కు ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. ఒక అధికారి మరియు ఒక రాజకీయ నాయకుడి మధ్య సాగుతున్న ఈ వ్యక్తిగత పోరు ఇప్పుడు వ్యవస్థల మధ్య పోరుగా మారుతోంది.