Polavaram News: పోలవరం(Polavaram) ప్రాజెక్ట్‌లో దెబ్బతిన్న డయాఫ్రంవా(Diaphragm-Wall)ల్‌ స్థానంలో కొత్తది నిర్మించాలా లేక...దెబ్బతిన్న ప్రాంతం వరకు మరమ్మతు చేపడితే సరిపోతుందా అన్న దానిపై అంతర్జాతీయ నిపుణులు బృందం పరిశీలించింది. దెబ్బతిన్న ప్రాంతాల్లో కొత్తది నిర్మించి పాత కట్టడానికి అనుసంధానించినంత మాత్రాన ఇబ్బంది ఏమీ ఉండదని వారు అభిప్రాయపడ్డారు.

 

పోలవరంలో నిపుణుల పరిశీలన

పోలవరం ప్రాజెక్ట్‌లో వరద ఉద్ధృతికి దెబ్బతిన్న ప్రాంతాలను అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలిస్తోంది. ఎగువు, దిగువ కాఫర్‌డ్యాంలతోపాటు దెబ్బతిన్న డయాఫ్రంవాల్‌(Diaphragm-Wall )ను క్షుణ్ణంగా తనిఖీ చేసింది. వరద ఉద్ధృతికి అక్కడక్కడ కొట్టుకుపోయిన డయాఫ్రంవాల్‌ను నిపుణుల బృందం పరిశీలించింది. దెబ్బతిన్న ప్రాంతంలో కొత్తది నిర్మించాలా లేక...మొత్తం డయాఫ్రంవాల్‌ కొత్తగా నిర్మించాలా అన్న దానిపై నీటిపారుదలశాఖ అధికారులు చర్చించారు. ఒక డయాఫ్రంవాల్‌కు మరో కొత్తది అనుసంధానించినంత మాత్రాన ఏలాంటి నష్టం ఉండదని...రెండింటికి మధ్య సమన్వయం ఉండదన్న ప్రచారం తప్పని నిపుణుల బృందం తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఉన్న డయాఫ్రంవాల్‌కు మరమ్మతులు చేసుకుంటే సరిపోతుందని ఓ నిపుణుడు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. వరద నీటిలో మునిగిపోయినంత మాత్రాన డయాఫ్రంవాల్‌(Diaphragm-Wall )కు ఏమీకాదని...నిపుణుల బృందం స్పష్టం చేసింది. అలాగే ఈ కట్టడానికి మరో కొత్త కట్టడం జత చేసినా కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తదన్నారు. పాత ప్రాజెక్ట్‌ల వద్ద మళ్లీ డయాఫ్రంవాల్‌ను వెడల్పు చేసి నిర్మించుకున్న ఘటనలో ప్రపంచంలో చాలా ఉన్నాయని వారు వివరించారు. కొత్తది, పాతది రెండూ  ఒకే సామర్థ్యం కలిగి ఉంటాయన్నారు. 

 

గతంలో చేసిన పరీక్షలు పరిశీలన

డయాఫ్రంవాల్‌ పనితీరుపై జాతీయ జల విద్యుత్ పరిశోధన సంస్థ ఇచ్చిన నివేదికన స్థానిక ఇంజినీర్లు అంతర్జాతీయ నిపుణుల బృందానికి చూపారు.

ఎలక్ట్రోడ్ల సాయంతో చేసిన పరిశోధనలు కాకుండా...అక్కడక్కడ తవ్వి మెటీరియల్ బయటకు తీసి పరీక్షించాలని అధికారులకు సూచించారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌(Cofferdam)లోనూ మరికొన్ని పరీక్షలు చేయించాల్సిందిగా నివేదించారు. బంకమట్టి ఉన్న చోట ఇంత భారీ నిర్మాణాలు చేయడం కష్టమనే అభిప్రాయాలను కూడా అంతర్జాతీయ నిపుణుల బృందం కొట్టిపారేసింది. ప్రపంచంలో చాలాచోట్ల ఇలాంటి మట్టి ఉన్న ప్రాంతాల్లోనే ప్రాజెక్ట్‌లు నిర్మించారని తెలిపారు. మంగళ, బుధవారాల్లోనూ మరిన్ని పరీక్షలు చేయనున్న నిపుణుల బృందం...ఆ తర్వాత ప్రాజెక్ట్ స్థితిగతులపై ఉమ్మడిగా నివేదిక అందించనుంది. 

 

పోలవరం(Polavaram) ప్రాజెక్ట్‌ వైసీపీ(YCP) పాలనలో పూర్తి నిర్లక్ష్యానికి గురైందని తిరిగి పట్టాలెక్కించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu) సంకల్పించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి క్షేత్రపర్యటనే పోలవరం ప్రాజెక్ట్‌ సందర్శించారు. దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆయన తనకు కన్నీళ్లు ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం అంతర్జాతీయ నిపుణుల బృందంతో పరీక్షలు చేయించాలని అధికారులను ఆదేశించారు. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తికావడానికి దాదాపు నాలుగున్నరేళ్లు పట్టే అవకాశం ఉందని ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు అంచనా వేస్తుండగా... నిపుణుల బృందం ఇచ్చే నివేదిక ప్రకారం ఆ సమయం పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. భారీ వరదలకు ప్రాజెక్ట్‌లోని కీలక కట్టడాలు దెబ్బతినడంతో తిరిగి నిర్మించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రాజెక్ట్‌ నిర్మాణం అంచనా వ్యయం కూడా అమాంతం పెరిగే అవకాశం ఉంది. గతంలో ఇస్తామని  హామీ ఇచ్చిన డబ్బులు ఇచ్చేందుకే కేంద్రం సవాలక్ష కొర్రీలు వేస్తుండగా...ఇప్పుడు పెరిగిన వ్యయంపై ఏమంటుందో చూడాలి