Heavy Rains In Telugu States: నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది. నైరుతి పవనాలు ఆదివారం మాల్దీవుల్లోని కొంతవరకూ, కోమరిన్ ప్రాంతంలో కొంతమేర, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల వరకూ విస్తరించాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ప్రీ మాన్ సూన్ సీజన్ లో తొలి అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ చత్తీస్ గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా సగటున సముద్ర మట్టానికి 3.1 కి.మీల ఎత్తులో కొనసాగిన ద్రోణి ఆవర్తనం ఆదివారం బలహీనపడిందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో ఆగ్నేయ/నైరుతి దిశగా గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. సాధారణంగా నైరుతి రుతు పవనాలు దేశంలోకి జూన్ 1న ప్రవేశించి.. కేరళను తాకి ఆ తర్వాత దేశమంతా వ్యాపిస్తాయి. ఐఎండీ తాజా అంచనా ప్రకారం మే 31 నాటికి కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి. జూన్ మొదటి వారంలోనే ఏపీని పలుకరిస్తాయని.. అటు తెలంగాణకు కూడా ముందుగానే రుతుపవనాలు వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏపీలో వర్షాలు
ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీకాకుళం, అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, నంద్యాల, కర్నూలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కొన్ని చోట్ల 30 - 40 కి.మీల ఈదురుగాలల వేగంతో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అటు, సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ నెల 22 నుంచి 27 వరకూ బలమైన తుపాను ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఈ నెల 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు.
తెలంగాణలో రాగల 5 రోజులు
అటు, తెలంగాణలో రాగల 5 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సిద్దిపేట, సూర్యాపేట, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, మెదక్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ నెల 20న తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదు కావొచ్చని చెప్పారు. 22న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లా వర్షపాతం నమోదు కావొచ్చని అన్నారు. అలాగే, ఈ నెల 23న ఖమ్మం, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని పేర్కొన్నారు.