IAS Krishna Teja to Andhra Pradesh: కేరళ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ మైలవరపు కృష్ణతేజ అక్కడి డ్యూటీ నుంచి రిలీవ్ అయ్యారు. ప్రస్తుతం యువ ఐఏఎస్ కృష్ణతేజ త్రిసూర్ జిల్లా కలెక్టర్‌‌గా సేవలు అందిస్తున్నారని తెలిసిందే. ఆయన ఏపీకి డిప్యూటేషన్ మీద రానున్నారు. ఏపీ ప్రభుత్వం కోరడంతో కేంద్ర ప్రభుత్వం కేరళ నుంచి కృష్ణతేజను రిలీవ్ చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కృష్ణతేజ మూడేళ్ల పాటు డిప్యూటేషన్ మీద తన సొంత రాష్ట్రానికి వస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ఏరికోరి యువ ఐఏఎస్ కృష్ణతేజను రాష్ట్రానికి వచ్చేలా ప్రయత్నాలు చేశారు.


త్రిసూర్ జిల్లా కలెక్టర్ గా తాను ఈరోజు రిలీవ్ అవుతున్నానని, ఇప్పటివరకు మద్దతు తెలిపిన, తనపై ప్రేమ చూపించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఐఏఎస్ కృష్ణతేజ Thrissur District Collector ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. దాంతో కేరళ నుంచి ఐఏఎస్ కృష్ణతేజ ఏపీకి రావడం ఫిక్స్ అయింది. త్వరలోనే ఆయన ఏపీలో సేవలు అందించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఓఎస్డీగా కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు. సమర్థవంతమైన అధికారులకు బాధ్యతలు అప్పగించి, ఏపీని మళ్లీ గాడిన పెడతామని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూసీ సీఎం పవన్ కళ్యాణ్ కోరిక మేరకు యువ ఐఏఎస్ కృష్ణతేజను డిప్యూటేషన్ మీద కేరళ నుంచి రప్పిస్తున్నారు.


ఏపీకి డైనమిక్ ఆఫీసర్ కృష్ణతేజ
మైలవరపు కృష్ణ తేజ(Krishna Teja) తొలిపోస్టింగ్‌ నుంచి సంచలనమే. ఆపరేషన్ కుట్టునాడు పేరిట 2 రోజుల్లోనే రెండున్నర లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఐఏఎస్‌ అధికారి కృష్ణతేజ. తక్కువ సమయంలో వరద ముప్పు నుంచి లక్షల మంది ప్రాణాలు కాపాడి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఆయన డిప్యూటేషన్ మీద సొంత రాష్ట్రం ఏపీకి వస్తున్నారు. 2017 కేరళ కేడర్‌కు చెందిన కృష్ణ తేజ తొలిపోస్టింగ్‌ కేరళలోని అలెప్పి జిల్లా సబ్‌ కలెక్టర్‌. సరిగ్గా ఏడాదిలోపే కేరళను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఆయన బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోపే తొలి పోస్టింగ్, కొత్త అధికారి అయినా కృష్ణతేజ వెనక్కి తగ్గలేదు. తెలివిగా వ్యవహరించి, అన్నిశాఖలను సమన్వయం చేసుకుని కేవలం 48 గంటల్లోనే సుమారు రెండున్నర లక్షల మందిని  సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొందర్ని స్వయంగా బోటులో తరలించి ప్రాణాలు కాపాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులతో సత్కరించాయి. దాతల సాయంతో అనంతరం వారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చారు.


అలెప్పిని పర్యాటకంగా డెవలప్ చేసి, ప్రాజెక్ట్‌లు తీసుకొచ్చారు. అనుమతుల్లేని విల్లాలను కూల్చివేసే సమయంలో ఎంత ఒత్తిడి చేసినా తట్టుకుని అనుకున్నది సాధించారు. డ్యూటీ విషయంలో ఎవరిని లెక్కచేయని మనస్తత్వం ఆయనది. అవినీతి రహిత సమర్థుడైన అధికారిగా ఆయన పేరు మారుమోగిపోయింది. గతంలో అలెప్పి నుంచి బదిలీ అయిన సమయంలో స్థానిక ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేశారంటే కృష్ణతేజపై వారికి ఉన్న నమ్మకం అది. త్రిసూరు కలెక్టర్‌గా చేస్తున్న కృష్ణతేజ సేవల్ని ఏపీ ప్రభుత్వం వినియోగించుకోవాలని నిర్ణయించుకుంది. కేంద్రాన్ని ఒప్పించి, డిప్యూటేషన్ మీద రాష్ట్రానికి రప్పిస్తున్నారు.