Hyderabad ED Raids: ఏపీ లిక్కర్ స్కాంలో సంచలనం - రాజ్ కేసిరెడ్డి సహా ఆరుగురు నిందితులకు షాక్ -హైదరాబాద్‌లో ఈడీ మెరుపుదాడులు !
Enforcement Directorate Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. లిక్కర్ స్కామ్ నిందితుడు రాజ్ కేసిరెడ్డి సహా ఆరుగురి ఇళ్లల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.

Raj Kesireddy: హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి మెరుపు దాడులకు దిగారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని దర్యాప్తు చేస్తున్న కేంద్ర సంస్థ.. తాజాగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డితో పాటు, ఆయనకు అత్యంత సన్నిహితులుగా భావిస్తున్న మరో ఆరుగురు కీలక వ్యక్తుల ఇళ్లు, వ్యాపార కార్యాలయాలే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతున్నాయి.
ఉదయం నుంచే పది ప్రత్యేక బృందాల సోదాలు
ఉదయం నుంచే ఈడీకి చెందిన ప్రత్యేక బృందాలు నగరంలోని విలాసవంతమైన నివాసాలు, కార్పొరేట్ ఆఫీసుల్లో సోదాలు జరుపుతున్నాయి. గతంలోనూ రాజ్ కేసిరెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఈడీ సుదీర్ఘంగా తనిఖీలు చేపట్టి, కీలక పత్రాలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తనిఖీల్లో లభించిన డిజిటల్ ఆధారాలు, వాట్సాప్ చాట్‌లు, బ్యాంక్ లావాదేవీల ఆధారంగా లభించిన తాజా సమాచారంతోనే ఈ రెండో విడత దాడులకు ఈడీ శ్రీకారం చుట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
విజయసాయిరెడ్డిని గతంలో ప్రశ్నించిన ఈడీ
ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ డి. వాసుదేవ రెడ్డి నివాసం, కోకాపేటలోని ఆయన బంధువుల ఇళ్లు, ఈ సిండికేట్‌లో మధ్యవర్తులుగా వ్యవహరించిన సందీప్, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి వంటి మొత్తం ఆరుగురు నిందితుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వ పెద్దల అండదండలతో సుమారు రూ. 3,500 కోట్ల మేర లిక్కర్ కిక్‌బ్యాక్స్ వసూలు చేశారనే ఆరోపణలపై ఇప్పటికే ఈడీ రూ. 441 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఈ కేసులో గతంలో జరిగిన పరిణామాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. గత సోదాల అనంతరం రాజ్ కేసిరెడ్డితో ఉన్న ఆర్థిక లావాదేవీలు, కొన్ని బినామీ కంపెనీల వ్యవహారాలపై విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు నేరుగా పిలిపించి సుదీర్ఘంగా ప్రశ్నించారు.ప్రస్తుతం జరుగుతున్న సోదాలు ఆ విచారణకు కొనసాగింపుగానే భావిస్తున్నారు. విజయసాయిరెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్లు, రాజ్ కేసిరెడ్డి ల్యాప్‌టాప్ నుంచి రికవర్ చేసిన అకౌంట్ బుక్స్ డేటాల మధ్య ఉన్న వ్యత్యాసాలను క్లియర్ చేసుకునేందుకే ఈడీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మద్యం సిండికేట్ నుంచి రాజకీయ నాయకులకు, వారి బంధువులకు అందిన ముడుపుల రూట్ మ్యాప్‌ను పూర్తిగా ఛేదించేందుకు ఈడీ ఈసారి పక్కా ప్లాన్‌తో వచ్చినట్లు సమాచారం.
మనీలాండరింగ్ రూట్స్ గుర్తించినట్లు ప్రచారం
ఈ లిక్కర్ స్కామ్‌లో సమకూరిన అక్రమ సొమ్మును హైదరాబాద్ రియల్ ఎస్టేట్ , కొన్ని షెల్ కంపెనీలలోకి మళ్లించారనే ఆరోపణలపై నాడే లోతైన విచారణ జరిగింది. ఆ నిధులను రియల్ ఎస్టేట్, జ్యువెలరీ రంగాల్లోకి ఎలా మళ్లించారు? అనే కోణంలో కొత్త ఆధారాల కోసం ఈ తాజా సోదాలు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో మరికొన్ని కీలక పత్రాలు, బినామీ పెట్టుబడుల వివరాలు లభ్యమైనట్లు తెలుస్తుండగా, రాబోయే రోజుల్లో ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ఈ లిక్కర్ స్కామ్ మరింత సెగ రేపడం ఖాయంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















