Woman Constable Slefie With Jagan In Guntur: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌తో (YS Jagan) సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్‌ అయేషా బానుకు ఉన్నతాధికారులు షాక్ ఇచ్చారు. విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఇలా వ్యవహరించడంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్‌కు ఛార్జిమెమో ఇస్తామని జైలర్ రవిబాబు తెలిపారు. ఆమె ఇచ్చిన వివరణ ఆధారంగా కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాగా, టీడీపీ ఆఫీస్ ధ్వంసం కేసులో అరెస్టై గుంటూరు సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్న బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ను (Nandigam Suresh) జగన్ బుధవారం పరామర్శించారు. ఆయనతో ములాఖత్ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అదే జైలులో పని చేస్తోన్న మహిళా కానిస్టేబుల్‌ అయేషాబాను తన కుమార్తెతో అక్కడకు వచ్చారు. జగన్‌కు తాను అభిమానిని అని, ఓ ఫోటో కావాలని రిక్వెస్ట్ చేశారు. దీంతో జగన్ కూడా నవ్వుతూ దానికి అంగీకరించగా ఆయనతో కలిసి సెల్ఫీ దిగారు. ప్రెస్ మీట్ సమయంలోనే ఇలా జరగడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు.


వైసీపీ ఆగ్రహం


అటు, వైఎస్ జగన్‌తో సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్‌కు ఛార్జిమెమో ఇవ్వడంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగిందని ఆరోపించింది. ఉద్యోగులను వేధించడంలో మీకు ఇదేం రాక్షసానందం అంటూ ఏపీ సీఎం చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనితపై మండిపడింది.






Also Read: Kedarnath: కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు