AP Highcourt :  తన వీడియోను మార్ఫింగ్ చేశారని ఎంపీ గోరంట్ల మాధవ్ ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ నమోదు చేసిన కేసుపై హైకోర్టు స్టే విధించింది.కేసులో తనను నిందితుడుగా పేర్కొనడాన్ని టీడీపీ నేత చింతకాయల విజయ్ సవాల్ చేశారు. కేసును కొట్టి వేయాలని హైకోర్టులో   స్క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు కేసు విచారణపై స్టే విధించింది. సంచలనం సృష్టించిన ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంలో దాదాపుగా నెల రోజుల తర్వాత గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేయడంతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ అశ్లీల వీడియోను సృష్టించి, టీడీపీకి చెందిన ఐ టీడీపీ గ్రూప్‌లో వ్యాప్తి చేసి తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారంటూ గోరంట్ల మాధవ్‌ ఆరోపించారు. 


వాట్సాప్ గ్రూప్‌లో చింతకాయల విజయ్ అడ్మిన్ కాదని లాయర్ల వాదన 


యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) ఫోన్‌ నంబర్‌ సాయంతో ఆ వీడియోను ఐ టీడీపీ గ్రూప్‌లో అప్‌లోడ్‌ చేశారని.. ఆ వీడియోకు చింతకాయల విజయ్‌కు   ఎలాంటి సంబంధం లేదని ఆయన తరపు లాయర్ వాదించారు.  ఈ కేసులో విజయ్‌ను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని.. అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించాలని అభ్యర్ధించారు. వాట్సాప్‌లో ఎవరైనా గ్రూప్‌ని సృష్టించవచ్చని.. అందులో ఎంతమందైనా సభ్యులుగా చేరవచ్చన్నారు. బ్రిటన్ నంబరుతో వీడియోను ఐ-టీడీపీ గ్రూప్‌లో అప్‌లోడ్‌ చేశారని ఎంపీ ఆరోపిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.గ్రూప్‌లో వీడియోను అప్‌లోడ్‌ చేసిన వ్యక్తినే ప్రాసిక్యూట్‌ చేయాలని కోరారు. పిటిషనర్‌ సంబంధిత గ్రూప్‌కు అడ్మిన్‌గా కానీ సభ్యుడుగా కానీ లేరని.. దీనికి విజయ్‌ని బాధ్యుడిని చేయడం సరికాదని వాదించారు.  


రాజకీయంగా కలకలం రేపిన మాధవ్ వీడయో వివాదం
 
ఎంపీ మాధవ్  మహిళతో న్యూడ్‌గా వీడియో కాల్ మాట్లాడారని ఆరోపణలు వచ్చాయి. కానీ ఈ వీడియో ఫేక్ అంటూ ఎంపీ మాధవ్ ఖండించారు. పక్కాగా మార్ఫింగ్ చేశారని.. ఇదంతా కుట్రగా చెప్పుకొచ్చారు. అనంతరం అనంతపురం ఎస్పీ ఈ వీడియో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. ఈ వీడియో మార్ఫింగ్ కావొచ్చని.. ఐ టీడీపీ ఈ వీడియోను వైరల్ చేసిందని చెప్పుకొచ్చారు. కొద్దిరోజుల క్రితం టీడీపీ అమెరికాలోని ఓ ల్యాబ్‌కు ఈ వీడియోను పంపామని.. ఇది ఒరిజనల్ అని తేలిందని ఓ రిపోర్ట్‌ను మీడియా ముందుకు తెచ్చింది. కానీ ఈ రిపోర్ట్ ఫేక్ అంటూ సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. తర్వాత ఎంపీ ఫిర్యాదుతో ఐటీడీపీపై కేసు నమోదు అయ్యింది.


బాధిత మహిళలు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసుల ప్రకటన


ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో రాజకీయంగానూ కలకలం రేపింది. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్‌సీపీ మధ్య తీవ్రమైన రాజకీయ వాదోపవాదాలు చోటు చేసుకున్నారు. ఆరోపణలు వచ్చాయి. వ్యక్దిగత దూషణలు చోటు చేసుకున్నాయి. మాధవ్ వీడియో కాల్ మాట్లాడినట్లుగా ఆరోపణలు ఉన్న మహిళలెవరూ ఫిర్యాదు చేయలేదు.దీంతో అది నైతికపరమైన అంశంగానే ఉండిపోయింది. అయితే మార్ఫింగ్ అని ఎంపీ ఫిర్యాదు చేయడంతో సీఐడీ కేసు పెట్టింది.