AP High Court: ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వైసీపీ, టీడీపీ పార్టీ కార్యాలయాల చుట్టూనే తిరుగుతున్నాయి.  అనుమతుల్లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా తాడేపల్లిలో నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయాన్ని మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో వైసీపీ నిర్మిస్తోన్న పార్టీ కార్యాలయాకు కూటమి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేనిపక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయా నోటీసుల్లో హెచ్చరించింది.

  


హైకోర్టులో వైసీపీ  పిటిషన్ దాఖలు
ఈ క్రమంలో వైసీపీ నేతలు ఏపీ  హైకోర్టును ఆశ్రయించారు.  రాష్ట్రంలో తమ పార్టీ కార్యాలయాలు కూల్చివేయబోతున్నారంటూ హైకోర్టులో లంచ్‌ మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగానే కార్యాలయాల కూల్చివేతకు రంగం సిద్ధం చేసిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.  ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తీసుకున్న తర్వాత కోర్టుకు పూర్తి సమాచారం ఇస్తామని ప్రభుత్వం తరుఫు న్యాయవాది స్పష్టం చేశారు. అయితే తాము ఇప్పటికిప్పుడు పార్టీ కార్యాలయాలను కూల్చివేయడం లేదని ప్రభుత్వ న్యాయవాది  తెలిపారు. అనుమతులు లేకుండా నిర్మించడంతో నోటీసులు మాత్రమే ఇచ్చామన్నారు. దీనితో కేసు విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. అయితే అప్పటి వరకు స్టేటస్‌ కో పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.   


మరో పార్టీ కార్యాలయానికి నోటీసులు
వైసీపీకి ఇటీవల కాలంలో వరుస షాకులు తాకుతున్నాయి.  ఇప్పటికే పలు జిల్లాల్లోని వైసీపీ కార్యాలయాలకు అధికారులు నోటీసులు ఇవ్వగా.. తాజాగా రాయచోటి వైసీపీ కార్యాలయానికి కడప అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధికారులు నోటీసులు అందజేశారు. అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షుడి పేరు మీద నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.  వారం రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని అధికారులు నోటీసుల్లో తెలిపారు. 


కూటమి శ్రేణుల ఆందోళన
అనకాపల్లి పట్టణ పరిధిలోని వైసీపీ కార్యాలయం ఎదుట కూటమి శ్రేణులు ఆందోళనకు దిగాయి. కాపు సామాజిక భవనానికి కేటాయించిన స్థలంలో అనుమతులు లేకుండా వైసీపీ కార్యాలయాన్ని నిర్మించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. కొత్తూరు నరసింగరావుపేటలో గత టీడీపీ ప్రభుత్వం హయాంలో కాపు సామాజిక భవనానికి కేటాయించిన స్థలంలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని నిర్మించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ భవనాన్ని కాపు సామాజిక భవనానికి కేటాయించాలని కూటమి శ్రేణులు డిమాండ్‌ చేశారు.