Akiveedu Ram Temple Raghurama :  పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని పెదపాడు  రామాలయ పునర్నిర్మాణం  అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. గత కొన్ని రోజులుగా స్థానికంగా రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసిన ఈ వివాదంపై న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలాంటి కూల్చివేతలు గానీ, కొత్త నిర్మాణ పనులు గానీ చేపట్టవద్దని కోర్టు స్పష్టం చేసింది.

Continues below advertisement

 రామాలయమా? గ్రామ దేవత గుడినా?                                              

ఆకివీడు పెదపేటలోని ఒక పురాతన కట్టడం చు ట్టూ ఈ వివాదం మొదలైంది. ఒక వర్గం అది  శ్రీరాముడి ఆలయమని , శిథిలావస్థకు చేరిన ఆ కట్టడాన్ని తొలగించి కొత్తగా భవ్యమైన రామాలయాన్ని నిర్మించాలని పట్టుబట్టింది. అయితే, స్థానిక దళిత సామాజిక వర్గం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అది తమ గ్రామ దేవత అయిన  గొంతెనమ్మ ఆలయమని, దశాబ్దాల క్రితం అక్కడ రాముడి విగ్రహాలను కూడా ప్రతిష్టించారని, కానీ ఇప్పుడు ఆ కట్టడాన్ని కూల్చివేసి పూర్తిగా రామాలయంగా మార్చడం తమ మనోభావాలను దెబ్బతీయడమేనని వారు వాదిస్తున్నారు.

Continues below advertisement

 రంగంలోకి రఘురామకృష్ణంరాజు.. రాజకీయ సెగ                                   

ఉండి ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్  రఘురామకృష్ణంరాజు  ఈ ఆలయ పునర్నిర్మాణ బాధ్యతను భుజాన వేసుకోవడంతో ఈ వివాదం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశమైంది. ఆయన స్వయంగా విరాళాలు సేకరించడం ప్రారంభించగా, ఒక్కరోజులోనే సుమారు 40 లక్షల రూపాయల నిధులు సమకూరాయి. అయితే, ఇటీవల శ్రీరామనవమి పర్వదినాన ఆయన ఆలయ సందర్శనకు వెళ్లినప్పుడు ఒక వర్గం ఆయనను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో జరిగిన ఘర్షణల వల్ల పోలీసులు అక్కడ 144 సెక్షన్‌ను కూడా విధించాల్సి వచ్చింది.

 హైకోర్టు ఆదేశాలు - అనుమతులు తప్పనిసరి                          

ఈ వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు, మతపరమైన కట్టడాల విషయంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని పేర్కొంది. ఏ మతపరమైన నిర్మాణం చేపట్టాలన్నా జిల్లా కలెక్టర్ ,  మున్సిపల్ కమిషనర్ అనుమతులు తప్పనిసరని కోర్టు వెల్లడించింది.అనుమతులు లభించే వరకు ప్రస్తుతం ఉన్న కట్టడాన్ని తాకవద్దని ఆదేశించింది.  రఘురామకృష్ణంరాజు స్వయంగా కోర్టుకు హాజరై, తాము కేవలం ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని, చట్టపరమైన అనుమతులు తీసుకున్న తర్వాతే పనులు ప్రారంభిస్తామని కోర్టుకు విన్నవించారు. ఈ అంశంపై ప్రభుత్వం పూర్తి వివరాలతో  కౌంటర్ దాఖలు చేయాలని  ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలతో ప్రస్తుతం ఆకివీడులో ఉత్కంఠకు తాత్కాలికంగా తెరపడినట్లయింది.