Delhi Highcourt: సాక్షి మీడియాపై హెరిటేజ్ రూ.100 కోట్ల దావా - సంచలన ఆదేశాలు ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు
Heritage lawsuit : వైసీపీ అధినేత జగన్ కుటుంబానికి చెందిన సాక్షి మీడియాపై హెరిటేజ్ వంద కోట్ల పరువు నష్టం దావా వేసింది. విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు హెరిటేజ్ పై వార్తల్ని తీసేయాలని ఆదేశించింది.

Heritage files Rs 100 crore lawsuit against Sakshi Media: వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ కుటుంబానికి సాక్షి మీడియాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హెరిటేజ్ ఫుడ్స్‌పై సాక్షి మీడియా ప్రసారం చేసిన కథనాలపై దాఖలైన రూ.100 కోట్ల పరువు నష్టం దావాను విచారించిన న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హెరిటేజ్ ఫుడ్స్‌కు, బోలేబాబా డెయిరీకి సంబంధం ఉందని, నెయ్యి కల్తీకి పాల్పడ్డారని సాక్షి మీడియాలో వచ్చిన వార్తలు సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని భావించిన కోర్టు.. సదరు కథనాలను తక్షణమే తొలగించాలని ఆదేశించింది.
హెరిటేజ్ ఫుడ్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు, 24 గంటల్లోగా సాక్షి మీడియా తన ప్లాట్‌ఫామ్‌లలో టెలికాస్ట్ చేసిన అన్ని లింక్‌లను తొలగించాలని నోటీసులు జారీ చేసింది. ఈ గడువులోగా లింక్‌లు తొలగించని పక్షంలో.. మెటా , గూగుల్, యూట్యూబ్ వంటి సంస్థలు జోక్యం చేసుకుని ఆ కథనాలను తొలగించాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తమ సంస్థకు బోలేబాబా డెయిరీతో ఎటువంటి సంబంధం లేదని, కేవలం రాజకీయ ఉద్దేశ్యంతోనే సాక్షి మీడియా ఇలాంటి తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోందని హెరిటేజ్ తరపు న్యాయవాదులు వాదించారు.
కొద్ది రోజులు కింద హర్యానా ప్రభుతవం ఇచ్చిన ఓ నోటీసులును సాకుగా చూపి హెరిటేజ్ ఉత్పత్తుల నాణ్యతపై సాక్షి మీడియా వరుస కథనాలు ఇచ్చిందని. అయితే, ఆయా జరిమానాలపై ఇప్పటికే జ్యుడీషియల్ ట్రిబ్యునల్ స్టే విధించిందని హెరిటేజ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వాస్తవాలను మరుగున పరిచి అసత్య ఆరోపణలు చేస్తున్నారని హెరిటేజ్ యాజమాన్యం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.























