టీడీపీ పిలుపునిచ్చిన మోత మోగిద్దాం కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన వచ్చింది. అయితే ఆ కార్యక్రమంలో విజిల్స్ వేసి సౌండ్ చేశారంటూ 60 మందిపై పోలీసులు కేసులు పెట్టాని టీడీపీ యువనేత నారా లోకేశ్ మండిపడ్డారు. విజిల్ వేస్తే పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


గుంటూరు పోలీసులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిల్‌ వేస్తే 60 మందిపై కేసా ? స్టేషన్‌కు పిలిచి విచారిస్తారా ? వీళ్ల తీరు చూస్తుంటే చంద్రబాబు అరెస్ట్‌ వార్తలు చూశారని, పసుపు రంగు దుస్తులు కట్టుకున్నారని, సైకిల్ బ్రాండ్ అగరు బత్తీలు వాడారని కూడా కేసు పెట్టేలా ఉన్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒక పని చేయండి రాజద్రోహం కేసు పెట్టి, ఉరిశిక్ష వేసేయండి అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. కేసులు పెట్టాలని ఆదేశాలు ఇచ్చినోళ్లు సరే, అమలు చేసినోళ్ల బుర్రా, బుద్ధి ఏమైంది ? అని ప్రశ్నించారు. సైకో జగన్‌ ఫ్యాక్షన్‌ పాలనలో ప్రజాస్వామ్యాన్ని పాతరేశారు. రాజ్యాంగాన్ని కాలరాశారు, సత్యాన్ని వధించారని ట్వీట్ లో మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని,  అరాచకాలను నిరసిస్తూ దీక్ష చేసి చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతున్నట్లు వెల్లడించారు. 






టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా గుంటూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించింది. చంద్రబాబుకు మద్దతుగా మోత మోగిద్దాం నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారిపై పోలీసులు కేసులు పెట్టారు. గుంటూరులోని పట్టాభిపురం పోలీసులు టీడీపీ కార్యకర్తలు, ప్రజలపై కేసు నమోదు చేశారు. బృందావన్‌ గార్డెన్స్‌ రహదారిపై మోత మోగిద్దాం కార్యక్రమంలో నిరసన చేపట్టారు. పోలీసుల అనుమతి లేకుండా ప్రజలకు ఆటంకం కలిగించేలా నిరసన తెలిపారని, గుంపులుగా చేరి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు.