Cbi Arrest Guntakal Railway Drm Vineet Singh On Corruption Charges:  అవినీతి ఆరోపణలతో గుంతకల్లు డీఆర్ఎం‌(Guntakal DRM) వినీత్ సింగ్(Vineet Singh) ను సీబీఐ అధికారులకు అదుపులోకి తీసుకున్నారు. కాంట్రాక్టర్ల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. డీఆర్ఎం కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. డీఆర్ఎం వినీత్ సింగ్‌తో పాటుగా మరో నలుగురు రైల్వే ఉద్యోగులను అరెస్ట్ చేశారు. 


కేంద్ర ప్రభుత్వం రైల్వే లైన్లను అభివృద్ధి చేసే  గతిశక్తి పథకంలో భాగంగా  జరుగుతున్న పనుల్లో పలు బ్రిడ్జ్ ల పనులను  నిర్వహించిన కాంట్రాక్టర్లు కొంతమంది అధికారులపై ఫిర్యాదు చేయడంతో సిబిఐ రంగంలోకి దిగింది. వరుసగా 3 రోజుల పాటూ సోదాలు నిర్వహించింది. కానీ అంతకు ముందు నుండే అధికారులపై సిబిఐ ప్రత్యేక బృందం నిఘాని ఉంచింది . చివరిగా గుంతకల్  డిఆర్ఎం వినీత్ సింగ్ తో పాటు మరో నలుగురిపై U/S 61(2)sec ,7,8,9,12 అవినీతి నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేశారు. అరెస్ట్ అయినవారిలో డివిజనల్ ఫైనాన్షియల్ మేనేజర్ ప్రదీప్ బాబు, ఇంజనీరింగ్ సెక్షన్  ఒ ఎస్ బాలాజీ,లక్ష్మీపతి రాజు,
ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్  సీనియర్ డిఈఎన్ కోఆర్డినేషన్ సౌత్  అక్కిరెడ్డి ఉన్నారు.   వీరితో పాటు ఇద్దరు కాంట్రాక్టర్లను కూడాఅదుపులోకి తీసుకున్నారు. వారిని కర్నూలు ఏసీబీ కోర్టులో జడ్జి ముందు హాజరుపరచనున్నారు.






దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో ఒక డిఆర్ఎం స్థాయి వ్యక్తిని అవినీతి ఆరోపణలతో ఆధారాలతో సహా అరెస్టు చేయడం ఇదే మొదటిసారి.  మొత్తం మీద రైల్వే శాఖలోని అత్యున్నత స్థాయి అధికారులు పట్టుబడటం సంచలనం కలిగించడమే కాకుండా రైల్వే శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  నిందితులను అదుపులోకి తీసుకున్న వెంటనే వారి అరెస్ట్ విషయమై  నిందితుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.  అలాగే వారి అరెస్టుకు గల కారణాలను వివరించారు.  నిందితులకు గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి కర్నూలు సీబీఐ కోర్టులో హాజరు పర్చారు.  మొత్తానికి కేంద్ర ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గతిశక్తి స్కీమ్ పనుల్లో  అవకతవకలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.