AP All Party Meeting : ఆంద్రప్రదేశ్ లో అప్రజాస్వామిక చర్యల పై సుప్రీం న్యాయమూర్తికి ఫిర్యాదు చేయాలని టీడీపీ ఆద్వర్యాన జరిగిన అఖిల పక్ష సమావేశం తీర్మానం చేసింది.ఎపీలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన, ప్రజాస్వామ్య హక్కుల దుర్వినియోగం పై ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం – సేవ్ డెమెక్రసీ నినాదంతో అఖిలపక్ష సమావేశం విజయవాడలో జరిగింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అద్యక్షతన జరిగిన సమావేశంలో పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గోని రాష్ట్రం లో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల పై విరుచుకుపడ్డారు.
మూడున్నరేళ్లలో ఏపీలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయ్యిందని, వైసీపీ వచ్చాక వాక్ స్వాతంత్రాన్ని ప్రజలు కోల్పోయారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెం నాయుడు విమర్శించారు. రాష్ట్రానికి ఒక ఫ్యాక్షనిస్టు సీఎం అయ్యాడని ద్వజమెత్తారు. జగన్ కు ఓటేసి ప్రజలు తప్పు చేశారని వ్యక్తిగతంగా భావిస్తున్నారని, తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. తండ్రి తరహాలోనే మరోసారి రాష్ట్రాన్ని దోచుకోవడానికి సీఎం అయ్యారని మండిపడ్డారు. ప్రజలు ఒక అవినీతి పరుడుకి ఓటేశారన్నారు. ఎన్నిక అయిన తరువాత వైసీపీ తప్ప రాష్ట్రంలో ఎవరూ ఉండ కూడదనుకుంటున్నారని మండిపడ్డారు. కేసులు పెట్టి, జైల్లో వేసినా ప్రతిపక్షాలన్నీ పోరాడుతున్నాయని అభినందించారు. ముఖ్యమంత్రి జగన్ పై అన్ని వర్గాలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, జగన్ రెడ్డి నాయకత్వంలోనే 40 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని గుర్తు చేశారు. జోగి రమేష్ ,చంద్రబాబు ఇంటి పై దాడికి పాల్పడ్డారని .. పల్నాడులో 18 మంది బలహీన వర్గాలకు చెందిన వారిని హత్య చేశారని గుర్తు చేశారు. మాచర్ల ఘటనతో రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించాలని ప్రయత్నం జరిగిందని ఫైర్ అయ్యారు.సిద్దాంతాలు, పార్టీలు వేరైనా ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అచ్చెన్నాయుడు అన్నారు.
స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం - సేవ్ డెమొక్రసీ అఖిలపక్ష సమావేశంలో పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు.ఈ తీర్మానాలను అఖిలపక్ష, ప్రజాసంఘాల నేతలు ఆమోదించారు. రాష్ట్రంలో జరిగిన అప్రజాస్వామిక, హింసాత్మాక ఘటనలు ఖండిస్తూ అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు కలిసి గవర్నర్, ఏపీకి రానున్న సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి వినతి పత్రం సమర్పించాలని తీర్మానం చేశారు. ప్రజాస్వామ్య ఉద్యమాన్ని మరింతగా సమన్వయ పరచడానికి రాష్ట్ర స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికను ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు.
పోలీసుల ఏకపక్ష దమన చర్యలను నిరసిస్తూ బాధితులకు రక్షణగా ప్రతి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక పని చేసేందుకు ప్రణాళికను సిద్దం చేయాలని తీర్మానం చేశారు. గ్రామ, మండల స్థాయిలో ప్రజల్ని చైతన్య పరచడానికి నిరంతర కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానం చేశారు.. ఏపీలో 2019 ప్రజా వ్యతిరేక పాలనపై నిరనస తెలిపిన ప్రతిపక్షం, ప్రజా సంఘాలు, దళిత, బహుజన, ముస్లిం మైనారిటీలపై జరిగిన హింసాత్మ దాడులను అఖిలపక్ష సమావేశంలో ఖండించారు. రాబోయే రోజుల్లో అఖిలపక్షం నేతలు విజయవాడ వేదిక గా చేసుకొని ప్రతి నెల సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు.