Ganta and Bharath Bhimili Assembly Ticket Issue: విశాఖపట్నం రాజకీయాల్లో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య సీట్ల సర్దుబాటుపై జరుగుతున్న ఆసక్తికర చర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుత ఎంపీ శ్రీభరత్ , సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు * తమ రాజకీయ భవిష్యత్తుపై చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో కేడర్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
భీమిలి నుంచి ఎమ్మెల్యేగా భరత్ పోటీ చేస్తారని ప్రచారం
గత కొంతకాలంగా ఎంపీ శ్రీభరత్ భీమిలి నియోజకవర్గంలో తరచుగా పర్యటిస్తూ, అక్కడి అభివృద్ధి పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంపీగా కాకుండా భీమిలి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. దీనిపై భరత్ స్పందిస్తూ.. తాను ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచనలో లేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా క్షేత్రస్థాయిలో కష్టపడేంత ఓపిక, పరిస్థితి నాకు లేదు.. నేను ఎంపీగానే కొనసాగుతాను అని వ్యాఖ్యానించడం ద్వారా తనపై వస్తున్న వదంతులకు ఆయన ఫుల్‌స్టాప్ పెట్టారు.
ఎమ్మెల్యేగా పోటీ చేసేంత తీరిక లేదని చెప్పిన శ్రీభరత్
ఇదే సమయంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒకవేళ భరత్ భీమిలి సీటు కోరుకుంటే, తాను తప్పుకోవడానికి సిద్ధమని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా, భరత్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తాను విశాఖ ఎంపీగా బరిలోకి దిగుతానని ఒక ఆసక్తికరమైన మ్యూచువల్ ఎక్స్ఛేంజ్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. గంటాకు గతంలోనూ ఎంపీగా పోటీ చేయాలనే ఆసక్తి ఉండటంతో, ఆయన వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
భీమిలీ నుంచి భరత్ పోటీ చేయాలనుకుంటే ...తాను ఎంపీగా పోటీ చేస్తానన్న గంటా సాధారణంగా ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పుడే ఇలాంటి చర్చలు రావడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. గంటా శ్రీనివాసరావు ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గం మారుస్తారనే పేరుంది. ఈ క్రమంలోనే ఆయన మళ్ళీ ఎంపీ స్థానంపై కన్నేశారనే చర్చ జరుగుతోంది. భరత్ కేవలం తన ఎంపీ పరిధినే కాకుండా, ఒక పక్కా ప్లాన్‌తో భీమిలిపై పట్టు సాధిస్తున్నారనే భావన గంటా వర్గంలో కలిగింది. జిల్లాలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి నేతలు ముందస్తుగానే తమ కోరికలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఈ బహిరంగ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు.
అప్పుడే టిక్కెట్ల లొల్లి ఎందుకు ?
మొత్తానికి విశాఖ రాజకీయాల్లో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే చర్చ ఇద్దరు నేతల మధ్య సఖ్యతను చూపుతున్నప్పటికీ, లోలోపల నియోజకవర్గాల పంపకాలపై స్పష్టత కోసం ఇద్దరూ ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం భరత్ క్లారిటీ ఇచ్చినప్పటికీ, గంటా చేసిన ఆఫర్ భవిష్యత్తులో విశాఖ పొలిటికల్ మ్యాప్‌ను మార్చేలా ఉందని టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.