ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌ను బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, పాతురి నాగభూషణం, సత్యమూర్తి, వీహెచ్‌పీ నేతలు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా వినాయక చవితి వేడుకలకు ప్రభుత్వం అనుమతి నిరాకరణపై గవర్నర్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా చవితి మండపాలు ఏర్పాటుకు అనుమతులు ఇచ్చేలా ప్రభుత్వానికి సూచించాలని గవర్నర్‌ను నేతలు కోరారు.  అధికార వైసీపీ హిందూ సంప్రదాయాలను కించపరస్తుందని బీజేపీ నేతలు ఆరోపించారు. గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మార్యదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. 




సీఎం జగన్ కు టీడీపీ నేతలు లేఖ


వినాయక చవితి వేడుకలు ఏపీలో హాట్ టాఫిక్​గా మారాయి.  బహిరంగ వేడుకలపై సర్కార్ ఆంక్షలు విధించటం పెద్ద దుమారం రేపుతోంది. బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంటే హిందూ ధార్మిక సంస్థలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తు్న్నాయి. ఇతర పండుగలకు లేని ఆంక్షలు కేవలం హిందూ పండుగలకే ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలకు అడ్డురాని నిబంధనలు వినాయక చవితికి ఎందుకని ప్రశ్నించారు. తాజాగా సీఎం జగన్ 175 నియోజకవర్గాల టీడీపీ ఇన్ ఛార్జిలు లేఖ రాశారు. 


Also Read : వినాయక చవితి వేడుకలపై ఆంక్షల వివాదం ! ప్రభుత్వం చెప్పిందేంటి ? విపక్షాల విమర్శలేంటి..?




ప్రజాగ్రహానికి గురికాక తప్పదు


వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడం సంస్కృతి, సంప్రదాయంగా వస్తున్నదని లేఖలో టీడీపీ నేతలు తెలిపారు. ఏ రాష్ట్రంలోనూ ఉత్సవాలు నిషేధించలేదని తెలిపారు. తెలంగాణలో కూడా ఆంక్షలు లేవన్నారు. ఏపీలోనే ఆంక్షలు విధించడం దురుద్దేశపూరితమన్నారు. ఈ నిర్ణయం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. వై.ఎస్ వర్ధంతి సభలు ఇడుపులపాయతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పెద్దస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించారని గుర్తుచేశారు. స్కూళ్లు ప్రారంభించవద్దని తల్లిదండ్రులు, నిపుణులు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం మెండిగా స్కూళ్లు తెరిచి విద్యార్థులు కరోనా బారిన పడేలా చేసిందన్నారు. కరోనా ఉన్నా మద్యం షాపులు ప్రారంభించారని, మద్యం షాపుల వద్ద పెద్ద ఎత్తున గుమికూడుతున్నా అప్పుడు పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు కరోనా చర్యలు అంటే విడ్డూరంగా ఉందన్నారు. 


'ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రజల్లో నిరసన వ్యక్తమవుతుంది. పన్నుల పెరుగుదల, మద్యం, ఇసుక రేట్లు పెరుగుదల, రోడ్లు, మహిళలపై అత్యాచారాలు, సీపీఎస్, పీఆర్సీ, మైనింగ్ కుంభకోణాలపై జరుగుతున్న చర్చలు, నిరసనల్ని పక్కదారి పట్టించేందుకే వినాయక ఉత్సవాలను రద్దుచేశారు. మత, కుల, ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు. జాతీయోద్యమంలోనే వినాయక ఉత్సవాలలో మతాలకు అతీతంగా అన్ని మతాల వారు పాల్గొన్నారు. కాబట్టి మీరు స్వార్థ రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి ఈ ఉత్సవాలకు అనుమతి ఇవ్వకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు' ---టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జులు


 


Also Read: గుంటూరులో చెత్త తరలించే ట్రాక్టర్ లో గణేష్ విగ్రహాలు... పారిశుద్ధ్య సిబ్బంది అత్యుత్సాహం... ఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన కమిషనర్