Gummanur Jayaram : కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి జయరామ్ కు ఈ సారి ఎమ్మెల్యే టిక్కెట్ కాకుండా ఎంపీ టిక్కెట్ ఆఫర్ చేశారు సీఎం వైఎస్ జగన్. ఈ మేరకు ఇంచార్జ్‌గా ప్రకటించారు. ఆలూరు నుంచి జడ్పీటీసీగా ఉన్న విరూపాక్షిని ఇంచార్జుగా ప్రకటించారు. కానీ జయరామ్ మాత్రం తన నియోజకవర్గంలో విరూపాక్షిని అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. ఆయన వర్గం అంతా ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని డిమాండ్ చేస్తోంది.  


కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు మంత్రి గుమ్మనూరు జయరాం ఆసక్తిగా లేరు. మూడో జాబితాలో ఆయన పేరు ఎంపీ స్థానానికి ఇంచార్జుగా ఉండటంతో..  ఆలూరు చేరుకుని  కార్యకర్తలు, అభిమానులతో సమావేశం అయ్యారు గుమ్మనూరు జయరాం.  వైసీపీ ఇంఛార్జిల మార్పులు చేర్పుల్లో భాగంగా నిన్న మూడో జాబితా విడుదల చేశారు సీఎం జగన్. అందులో ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జయరామ్ ను కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు జగన్. అయితే, ఎంపీగా పోటీ చేయడం తనకు ఇష్టం లేదని, ఆలూరు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని జయరాం అంటున్నారు. తనకు ఆలూరు ఎమ్మల్యే అభ్యర్థి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంపీగా వెళ్లాలా? లేదా? అన్నది కార్యకర్తలే తేల్చాలని కోరారు.  అభ్యర్థులను ఖరారు చేసినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంకా రెండు నెలల సమయం ఉందంటూ హాట్ కామెంట్స్ చేశారు గుమ్మనూరు జయరామ్.                                 


”15 ఏళ్ళుగా నాకు సహకరించిన కార్యకర్తలకు ఎంతో రుణపడి ఉంటా. మంత్రిగా మనం రూలింగ్ లో ఉన్నా ఎక్కడా కూడా దౌర్జన్యం చేయలేదు. మంత్రిగా నేను ఏనాడూ గొడవలను ప్రోత్సహించలేదు. వ్యక్తిగత కక్షలు లేకుండా ఉన్నాము. నేను కర్నూలు ఎంపీ టిక్కెట్ జేబులో పెట్టుకుని వచ్చాను. కార్యకర్తలు అభీష్టం మేరకే నడుచుకుంటానని ప్రకటించారు.   మీ నిర్ణయం పైనే నా రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. ఇంకా 2 నెలలు సమయం ఉంది. అభ్యర్థులను ఖరారు చేసినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నామినేషన్ వేసిన తర్వాత సైతం అభ్యర్థులను మార్చిన సంఘటనలు అనేకం చూశాము. నన్ను ఎంపీగా వెళ్లమంటారా లేదా అనేది మీరే తేల్చండి.                                   


కార్యకర్తలు అదేశిస్తే అనేక దారులు ఉన్నాయి. మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి గుమ్మనూరు జయరాం. జయరాం వ్యాఖ్యలు చూస్తూంటే ఆయన ఆలూరు నుంచే ఏ పార్టీ తరపున అయినా సరే పోటీ చేయడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది. ఈ అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారిస్తుందా లేకపోతే.. జయరాం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది.