Balineni Srinivasa Reddy on Jagan :  మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  సీఎంజగన్ మోహన్ రెడ్డికి తమపై అభిమానం  ఉండాలి కదా అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల ద్వారా జగన్ తమను నిరాదరిస్తున్నట్లుగా ఆయన సందేశం పంపినట్లయింది. ఒొంగోలులో జరిగిన ఓ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలని మా అబ్బాయి కోరుకున్నాడని..  తెలంగాణ అంతా తిరిగి  బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాడన్నారు. అయితే తాను మాత్రం కాంగ్రెస్ గెలుస్తుందని 50 లక్షల రూపాయలు బెట్టింగ్ కాశానన్నారు. కానీ తన కుమారుడు ఫీలవుతాడని.. ఆ బెట్టింగ్ ను వెనక్కి తీసుకున్నాన్నారు.  


తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని బెట్టింగ్ పెట్టా ! 


తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తే ఏపీలోనూ జగన్ గెలుస్తాడని తన కుమారుడు అనుకున్నాడని బాలినేని చెప్పుకొచ్చారు.  ఏపీలో వైసీపీ రావాలని తన కుమారుడు కోరుకుంటున్నాడని అభిమానమని చెప్పుకొచ్చారు. అయితే జగన్ కూ తమపైఅభిమానం ఉండాలన్నట్లుగా మట్లాడారు. తనకు టిక్కెట్ ఇవ్వరని  జిల్లాలో వేరే చోట టిక్కెట్ ఇస్తారని జరుగుతున్న  ప్రచారాన్ని కూడా ఖండించారు. తాను ఒంగోలులో తప్ప మరెక్కడా పోటీ చేయబోనన్నారు. పాతిక వేల ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని జగన్ రెడ్డికి చెప్పానని బాలినేని చెప్పుకొస్తున్నారు. 


మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నా : బాలినేని 


అవినీతిపైనా బాలినేని శ్రీనివాసరెడ్డి విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. తాను నీతి మంతుడినని చెప్పడం లేదన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్ననని చెప్పారు. అయితే తాను వెయ్యి కోట్లు సంపాదించానని గిట్టని వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బాలినేని ఇటీవలి కాలంలో ఎన్నో సార్లు జగన్ మోహన్  రెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన అసంతృప్తికి గురయినప్పుడల్లా జగన్ మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడారు కానీ.. సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. దీంతో బాలినేని తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు తమపై జగన్ కు అభిమానం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు.


సినిమాలు తీస్తా : బాలినేని                                         


ప్రస్తుత రాజకీయాలు చూస్తే తనకు ఇరిటేషన్ వస్తుందని బాలినేని చెబుతున్నారు. అంతేకాకుండా తనకు సంబంధం లేని వాటిని ఆపాదిస్తున్నారని బాలినేని పేర్కొన్నారు.రాజకీయాలంటేనే విరక్తి పుట్టిందని చెప్పారు.  రాజకీయాల్లోకి రాకముందు సినిమాలు సినిమాలు తీయాలనే కోరిక ఉండేదని తెలిపారు.సినిమా ఫీల్డ్ లోకి అడుగుపెట్టి సినిమాలు తీస్తానని వెల్లడించారు. జగన్ అంటే తనకు ఎంతో ఇష్టమన్న బాలినేని ఆయన మరోసారి సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వెల్లడించారు.ప్రస్తుతం కుల ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. మీరంతా అండగా ఉంటేనే పోటీ చేస్తా లేదంటే చేయనని నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు