AB Venkateswara Rao: కులగొడవల్లో హత్యలు చేసుకుంటే లక్షలు ఇచ్చేస్తారా? - ఏపీ ప్రభుత్వంపై మాజీ ఐపీఎస్ సంచలన వ్యాఖ్యలు
Kandukur Issue: లక్ష్మినాయుడు కుటుంబానికి సాయం ప్రకటనపై మాజీ ఐపీఎస్ విమర్శలు గుప్పించారు. ఏపీలో ఏడాదికి 9వేల హత్యలు జరుగుతాయని అందరికీ ఎకరాలు రాసిస్తారా అని ప్రశ్నించారు.

Former IPS AB Venkateswara Rao On govt: కందుకూరు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవల్లో జరిగిన హత్య ఘటనలో బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరిహారం చెల్లించడంపై విమర్శలు వస్తున్నాయి. మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకేటశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రధాన సమస్యలు అన్నింటినీ పక్కనపెట్టి కుల గొడవలు, హత్యలు మీద దృష్టి పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు ప్రశ్నలు సంధించారు. పోలీసులు చేయాల్సిన పని చేయడం లేదని స్పష్టంచేశారు.
కులాల గొడవలతో కొట్టుకు చస్తే ఎకరాలకు ఎకరాలు, లక్షలకు లక్షలు ఇవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎవడబ్బ సొత్తు ఇదని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉండేవాళ్లు వాళ్ల సొంత ఆస్తులు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ఏపీలో ఏడాదికి 900 హత్య కేసులు నమోదవుతున్నాయి..అందరికి ఇదే విధంగా పరిహారం ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఏయే కులాల కొట్టుకుంటే.. నష్ట పరిహారం ఇస్తారో చెప్పాలని ఆయన సెటైరిక్ గా ప్రశ్నించారు. కొన్ని కులాల్లో మాత్రమే చంపుకుంటేనే ఇలాంటి నష్ట పరిహారం ఇస్తారా ..లేకపోతే అన్ని కులాలకు ఇదే విధమైన నిబంధన వర్తిస్తుందా చెప్పాలని ఆయన నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కందుకూరు సమీపంలోని గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామంలో దసరా పండుగ రోజు జరిగిన దారుణ హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. 25 ఏళ్ల తిరుమలశెట్టి లక్ష్మీనాయుడును హరిచంద్రప్రసాద్ అనే వ్యక్తి కారుతో కొట్టి చంపారు. లక్ష్మినాయుడు సోదరులకు కాళ్లు, చేతులు విరిగాయి. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలకారణంగానే ఈ హత్యలు జరిగాయని పోలీసులు ప్రకటించారు. అయితేఈ ఈ హత్య రాజకీయ, కులాల కుంపటిగా మారింది.
చనిపోయిన లక్ష్మీ నాయుడు కుటుంబానికి పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. భార్యకు 2 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదు పరిహారం ఇవ్వాలని నిర్మయించారు. ఇద్దరు పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి, రూ.5 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాటిజ్ చేయాలని సీఎం ఆదేశించారు. లక్ష్మీ నాయుడు పిల్లలను చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. అలాగే కారు దాడిలో గాయపడ్డ పవన్, భార్గవ్‌కు కూడా పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. పవన్‌కు 4 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదుతో పాటు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. భార్గవ్‌కు రూ.3 లక్షల నగదు, ఆసుపత్రి ఖర్చులు చెల్లించనున్నారు. లక్ష్మీ నాయుడు హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించి.. కోర్టులో కేసు విచారణ కోసం ప్రత్యేక పీపీని నియమించాలని ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు.
ఈ నిర్ణయంపైనే పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ ఐపీఎస్ ఏబీవీ బహిరంగంగా విమర్శలు గుప్పించారు.





















