Kiran Kumar Reddy not seen in active politics : మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీలో జమిలీ ఎన్నికల వేడి పెరిగిన సమయమంలో కనిపించకుండా పోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత సొంత పార్టీ పెట్టుకున్నారు. కొన్నాళ్లకు మళ్లీ సొంత పార్టీలో చేరారు. కానీ అక్కడ ఉండలేక కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. కానీ ఆయన ఎప్పుడూ యాక్టివ్ పాలిటిక్స్ లో కనిపించడం లేదు. తెలంగాణ ఎన్నికల సమయంలో సీమాంధ్ర ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన ఉపయోగపడతారని కమలం పార్టీ అంచనా వేసింది. కొన్ని సమావేశాల్లో కనిపించారు.
కానీ విజయశాంతి వంటి నేతలు విమర్శలు చేశారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణలో పార్టీ కార్యాలయానికి రాగానే విజయశాంతి గుర్రుగా చూశారు. సమైక్య వాది మన పార్టీలోకి రావడమేంటని జాతీయ పార్టీ మహిళ నేత కస్సుమన్నారు. ఆమె వేదికపైకి ఎక్కకుండానే వెళ్లారు. తెలంగాణ ద్రోహులను పార్టీలోకి తీసుకున్నందుకు తాను వేదికపైకి వెళ్లలేదని కూడా విజయశాంతి చెప్పారు. ఆ తర్వాత ఆయన మరే సమవేశానికి హాజరు కాలేదు. ఇప్పుడు ఏపీ ఎన్నికలు వచ్చేసినా ఆయన ఎక్కడా కనిపించడం లేదు.
ఇక కాంగ్రెస్ లో కొన్నేళ్లు పాటు ఉన్నా సైలెంట్ గా ఉన్న కిరణ‌్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత యాక్టివ్ అవుతారని భావించారు. అయితే ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడంతో ఇటు తెలంగాణకు, అటు ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్నికలకు బాగా పనికొస్తాడని పార్టీలో చేర్చుకున్నారు. పైగా మాజీ ముఖ్యమంత్రి కావడంతో ప్లస్ పాయింట్ అయింది. ఆయన పార్టీలో చేరితే రెడ్డి సామాజికవర్గం ఓటర్లు కమలం వైపు చూస్తారని భావించారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి వల్ల బీజేపీకి ఎలాంటి మేలు జరగలేదన్న వాదన వినపిస్తోంది.
తెలంగాణ ఎన్నికల సమయంలో తెర వెనుక పాత్ర పోషించే ప్రయత్నం చేసినా వర్కవుట్ కాలేదు. దాంతో ఆయన రాజకీయాల్లో కనిపించడం మానేశారు. ఏపీ బీజేపీ కార్యక్రమాల్లో అసలు పాల్గొనడం లేదు. పార్టీలో చేరినప్పుడు ఏపీకి వచ్చి ఒక మీడియా సమావేశం పెట్టి కనిపించి వెళ్లిపోయారు. తర్వాత బీజేపీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి బాధ్యతలను చేపట్టే సమయంలో కనిపించారు. ఇక అంతే ఆయన అడ్రస్ లేదు. హైదరాబాద్ లోనే ఉంటున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడా, అక్కాడ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. సమైక్యాంధ్ర కోసం పోరాడిన ఏపీలోనైనా ఆయన కాలు కదుపుతారునుకుంటే అది కమలనాధులకు అత్యాశే మిగిలింది.
ప్రస్తుతం ఏపీలో పొత్తుల చర్చలు నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో కీలక స్థానాల్లో తాము పోటీ చేస్తామంటూ కొంత మంది ముందుకు వస్తున్నారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి పేరు మాత్రం అసలు ప్రచారంలోకి రావడం లేదు. దీంతో ఏ పార్టీలో చేరినా సైలెంట్ మోడ్ లోనే ఉంటారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.